‘బుల్‌డోజర్‌ న్యాయం’ ఎన్నాళ్లు?

Kanpur Bulldozer Action: Mother Daughter Loses Their Lives Amid Anti Encroachment Campaign - Sakshi

బుల్‌డోజర్‌లే సర్వరోగ, సర్వ సమస్యల నివారిణిగా భావించటం ఎంత ప్రమాదకరమో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి కనీసం ఇప్పటికైనా అర్థమైవుండాలి. ఆ రాష్ట్రంలోని కాన్పూర్‌ జిల్లా మడౌలీలో ‘ఆక్రమణలు’ తొలగించే పేరిట సోమవారం బుల్‌డోజర్‌లు వీరంగం వేస్తుండగా హఠాత్తుగా ఒక గుడిసెలో మంటలు ఎగసి తల్లీకూతుళ్లిద్దరు సజీవదహనమయ్యారు. బాధితుల బంధువులు చెబుతున్నట్టు ఇవి దారుణ హత్యలా, అధికారులంటున్నట్టు ఆత్మహత్యలా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది. కానీ ప్రభుత్వ చర్య ఏదైనా చట్టాలకు అనుగుణంగానే ఉండాలని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పి చాన్నాళ్లవుతున్నా ఆ రాష్ట్రంలో బుల్‌డోజర్‌ల వినియోగం ఆగలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది.

బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచారని ఆరోపిస్తూ  నిరుడు జూన్‌లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా ప్రయాగ్‌రాజ్, షహ్రాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక ఆ నిరసనలకు సూత్రధారులుగా భావిస్తున్నవారి ఇళ్లను బుల్‌డోజర్‌లు పంపి నేలమట్టం చేశారు. నిజానికి ఇది యూపీకే పరిమితమై లేదు. బీజేపీ సర్కారుండే మధ్యప్రదేశ్‌లో నిరుడు ఏప్రిల్‌లో మతపరమైన ఘర్షణలు జరిగాక 16 ఇళ్లనూ, 29 దుకాణాలనూ అధికారులు కూల్చేశారు. అదే నెలలో బీజేపీ అధీనంలోని అప్పటి ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మత ఘర్షణలు జరిగిన జహంగీర్‌పురిలో ఇదే పద్ధతిలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశారు.

నిజానికి చట్టబద్ధ పాలన అనే భావన రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా ఎక్కడా ఉండదు. కానీ అది సవరణకు వీలుకాని రాజ్యాంగ మౌలిక నిర్మాణ స్వరూపమని నిపుణులంటారు. ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరులు మొదలుకొని అత్యున్నత స్థానాల్లో ఉండేవారి వరకూ అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాల్సినవారే. కానీ ఈ ‘బుల్‌డోజర్‌ న్యాయం’ అన్ని చట్టాలనూ, నిబంధనలనూ బేఖాతరు చేస్తోంది. సాధారణంగా అయితే అక్రమమని తేలిన నిర్మాణాలను గుర్తించాక వాటి యజమానులకు అధికారులు ముందుగా నోటీసులివ్వాలి. వారినుంచి సంజాయిషీలు తీసుకున్నాక అవసరమైన వ్యవధినిచ్చి నిర్మాణాలు తొలగించాలి. కానీ ఈ ఉదంతాలన్నిటా జరుగుతున్నది వేరు.

ఏదైనా ఘర్షణల్లో నిందితులుగా గుర్తించినవారి ఇళ్లనూ, దుకాణాలనూ ఒక పద్ధతి ప్రకారం కూల్చేస్తున్నారు. నామమాత్రంగా నోటీసులిచ్చి కనీసం వారి సామాన్లు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా బుల్‌డోజర్‌లతో నేలమట్టం చేస్తున్నారు. మడౌలీ ఉదంతమే తీసుకుంటే గత నెల 14న కిషన్‌ గోపాల్‌ దీక్షిత్‌ అనే ఆసామి ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లను చెప్పాపెట్టకుండా వచ్చిన అధికారులు కూల్చేశారు. వేరే ఆశ్రయం పొందటం అసాధ్యం కావటంతో కూల్చినచోటే దీక్షిత్‌ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. సరిగ్గా నెల తర్వాత మళ్లీ వచ్చిన అధికారులు ఆ గుడిసెవైపు బుల్‌డోజర్‌ను గురిపెట్టారు. తామంతా గుడిసెలో ఉండగానే భయభ్రాంతుల్ని చేసి పంపేయటానికి బుల్‌డోజర్‌ను ప్రయోగించారని, దానికి లొంగకపోవటంతో గుడిసెకు నిప్పంటించమని  సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించారని బాధితుడు శివం దీక్షిత్‌ అంటున్నాడు. తానూ, తండ్రి స్వల్పగాయాలతో తప్పించుకున్నా తల్లి, 21 ఏళ్ల సోదరి సజీవదహనమయ్యారని చెబుతున్నాడు. బుల్‌డోజర్‌ల ప్రయోగం మొదలెట్టినప్పుడు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఎక్కువ సందర్భాల్లో ఒక మతంవారినే దృష్టిలో పెట్టుకుని ఈ కూల్చివేతలు జరగటం అందుకు కారణం కావొచ్చు. కానీ ఇలాంటి ధోరణి చివరకు అరాచకానికి దారితీస్తుందని చాలామంది హెచ్చరించారు.

విచక్షణ మరిచి సమస్య ఉన్నచోటికల్లా బుల్‌డోజర్‌లు వెళ్లడం మొదలైతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించటం కష్టం. ఆమధ్య ఒక ఉదంతంలో రాళ్లు విసిరాడని ఆరోపణలొచ్చిన యువకుడు రెండు చేతులూ లేని వికలాంగుడు. అతని దుకాణాన్ని అధికారులు కూల్చేశారు. ఈ మాదిరి ఘటనల్లో అధికారులు తమ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా? మడౌలీ ఉదంతంలో తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యారని తెలియగానే సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌తో సహా అధికారులంతా పరారయ్యారు. వారు అక్కడే ఉంటే ఏం జరిగేదో! దోషులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ చేసిన ప్రకటనకు పెద్దగా విలువుండదు. బుల్‌డోజర్‌లను ఇష్టానుసారం వినియోగించే స్వేచ్ఛ ప్రభుత్వమే ఇచ్చినప్పుడు ఇలాంటి విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేముంది? ఈ ఉదంతాల్లో చివరకు దోషులుగా తేల్చేదెవరిని? శిక్షించేదెవరిని? 

నేరారోపణలు చేయటం, దాన్ని న్యాయస్థానాల్లో నిరూపించటం, తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు శిక్షించటం అనే ప్రక్రియలుంటాయి. ఈ మూడు పాత్రలనూ ఒకరే పోషించాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం మంటగలుస్తుంది. సాధారణ ప్రజానీకం సైతం ఈ ధోరణినే అనుసరించే ప్రమాదం ఉంటుంది. ఏతావాతా ఈ మాదిరి చర్యలు ఒకరకమైన అరాచకానికి దారితీస్తాయి. బుల్‌డోజర్‌ల గురించి సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలైనప్పుడు అసలు కారణాలు దాచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలుండటంవల్లే కూల్చామని యూపీ సంజాయిషీ ఇస్తోంది. ఒక ప్రభుత్వం తన చర్యల ఆంతర్యాన్ని తానే చెప్పుకోలేని దుఃస్థితిలో ఉండటం అధికార యంత్రాంగానికి నైతికబలం ఇవ్వగలదా? రెండు నిండు ప్రాణాలు బలిగొన్న మడౌలీ ఉదంతానికి మూలం ఎక్కడుందో ఇప్పటికైనా ఆదిత్యనాథ్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరెక్కడా ఇలాంటి ఉదంతాలు పునరావృతం కానీయకుండా, చట్టవిరుద్ధతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top