‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ నిజాలు!

Black and white truths - Sakshi

సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్‌ పేపర్‌) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్‌ నల్లపత్రం (బ్లాక్‌ పేపర్‌) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది.

2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్‌ విడుదల చేసిన బ్లాక్‌ పేపర్‌ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది.

ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్‌ పేపర్‌) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్‌ పేపర్‌ పేరిట కాంగ్రెస్‌ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. 

వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్‌ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి.

రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్‌పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ.

కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది.

అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. 

యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్‌ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్‌ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. 

whatsapp channel

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top