మరో ఘరానా మోసం!

Abg Shipyard Scam India's Biggest Bank Scam Questioned By Cbi - Sakshi

‘ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి... పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్‌’ అని ఏనుగు లక్ష్మణకవి ప్రసిద్ధ నీతి పద్యం. ఆకాశంలోని గంగ చివరకు పాతాళానికి చేరినట్టే, వివేకం కోల్పోయి ప్రవర్తిస్తే ఎంతటివారికైనా ఇక్కట్లు తప్పవు. అత్యున్నత స్థానం నుంచి అధఃపాతాళానికీ పడిపోకా తప్పదు. నౌకా నిర్మాణరంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అదే.

తప్పుడు దోవ తొక్కి ‘దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ మోసం’ చేసి, అప్రతిష్ఠ పాలైంది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర నేరపరిశోధనా సంస్థ (సీబీఐ) ఎట్టకేలకు ఏబీజీ పైనా, దాని డైరెక్టర్ల పైనా కేసులు పెట్టింది. అప్పటి మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్లు  తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు బదలాయించి, లెక్కల్లో సర్దుబాట్లు చేసిన తీరుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. విదేశాల్లోని అనుబంధ సంస్థకు భారీగా పెట్టుబడులు మళ్ళించిన ఏబీజీ ఆ పైన వాటిని పన్ను బెడద లేని తీరాలకు తరలించిందా అన్నది చూడాలి. వెరసి దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టిన మరో బడా సంస్థ బాగోతం ఆశ్చర్యపరుస్తోంది. 

ఒక దశలో రూ. 16,600 కోట్ల మేర ఆర్డర్లున్న అగ్రశ్రేణి సంస్థ ఏబీజీ షిప్‌యార్డ్‌ రూ. 23 వేల కోట్ల అతి పెద్ద బ్యాంక్‌ కుంభకోణానికి మూలం కావడం ఆశ్చర్యకరమే! 2012– 17 మధ్య అయిదేళ్ళలో 28 బ్యాంకుల కన్సార్టియమ్‌ను వేల కోట్ల అప్పులతో మోసం చేసింది. ఎస్‌బీఐ, ఐడీబీఐ, ఐసీఐసీఐ లాంటి పేరున్న బ్యాంకులూ ఆ సంస్థ చేతిలో మోస పోవడం విచిత్రం. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌లూ, ఆడిట్‌ నివేదికలు తెరపైకి వచ్చినా, అప్పులిచ్చిన బ్యాంకులు, చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు చాలాకాలంగా చర్యలు చేపట్టక, నిద్రావస్థలోనే ఉండిపోవడం మరీ విడ్డూరం. 

పదేళ్ళ క్రితం 2012 –13 నాటికి రూ. 107 కోట్ల నికర లాభాలతో దూసుకుపోతున్న సంస్థ ఆ మరుసటేడే రూ. 199 కోట్ల నష్టానికి జారిపోయి, చివరకు దివాళా తీశానని చేతులెత్తేయడం ఓ గమ్మత్తు. గుజరాత్‌లోని సూరత్‌ వద్ద తపతీ నది ఒడ్డున మగ్దల్లా ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన షిప్‌యార్డ్‌ ఉన్న ఏబీజీ ప్రస్థానం మూడున్నర దశాబ్దాల పైచిలుకు క్రితం 1985 మార్చిలో మొదలైంది. 1990లో తొలి షిప్‌ను అందించింది. అప్పటి నుంచి 2013 లోపల 165కి పైగా షిప్పులు రూపొందించిన ఘనత ఆ సంస్థది. ఆ నౌకల్లో నూటికి 80 అంతర్జాతీయ కస్టమర్ల కోసమే. 2000లో కోస్ట్‌గార్డ్‌ కోసం రెండు బోట్ల తయారీకి తొలి ప్రభుత్వ ఆర్డర్‌ పొంది, దేశ రక్షణ అవసరాల్లోకీ విస్తరించింది. జలాంతర్గాములు సహా రక్షణ శాఖ ఓడల తయారీకి 2011లో కేంద్రం ఈ సంస్థకు లైసెన్స్‌ ఇచ్చింది. దహేజ్‌లో రెండో షిప్‌ యార్డ్‌ పెట్టి, రూ. 2500 కోట్లతో మూడో షిప్‌యార్డ్‌కు అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకొని, ఆఖరికి మునిగిపోతున్న పడవ లాగా మారిపోయింది. 

1995 నుంచి బీజేపీయే పాలిస్తున్న గుజరాత్‌లో ఈ మోసం పాల్పడడంతో, దేశాన్ని లూఠీ చేస్తున్నవారికి కొమ్ము కాస్తున్నారంటూ కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కాగా, కేంద్రంలో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ఉండగానే కుంభకోణం జరిగిందన్నది బీజేపీ ప్రతి విమర్శ. వాటిని అటుంచి – అసలు ఒక సంస్థ ఇంత భారీ స్థాయిలో, ఇన్ని బ్యాంకుల్ని మోసం చేసే దాకా అన్ని వ్యవస్థలూ నిద్ర పోయాయా? లేక నిద్ర నటించాయా? మోసం జరిగిందని 2019 జనవరిలో గుర్తించిన ఎస్‌బీఐ, ఆ నవంబర్‌ దాకా ఫిర్యాదు దాఖలు చేయలేదు. మరింత సమగ్రంగా 2020 ఆగస్టులో తాజా ఫిర్యాదు చేసింది. మోసాన్ని గుర్తించిన మూడేళ్ళకు ఎట్టకేలకు ఈ ఫిబ్రవరి 7న ఆ సంస్థ చైర్మన్‌– ఎండీ రిషీ కమలేశ్‌ అగర్వాల్, ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

కేసు దాఖలుకే ఎందుకింత ఆలస్యమైంది? సామాన్యులు రుణం తీసుకోవాలన్నా, తీసుకున్న చిన్న రుణానికి వడ్డీ ఆలస్యమైనా అనేక కష్టాలు తప్పని మన దేశంలో బడాబాబులకు మాత్రం భారీ ఆర్థిక మోసాలకు తెగబడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ‘ఎగ్గొట్టి ఏటవతలకు పోదా’మనే పాత నానుడికి తగ్గట్టు ఇలాంటి ఘరానా దొంగలు ఎందరో దేశం విడిచిపోయి, దర్జాగా విదేశాల్లో కులుకుతుంటే వారిని పట్టితెచ్చి, శిక్షించకపోవడం ఎవరి తప్పు? సొంత సేవింగ్స్‌ ఖాతాలో సొమ్ము తీసుకోవడానికి కూడా సవాలక్ష రూల్స్‌ పెట్టే బ్యాంకులు ఇన్ని వేల కోట్లకు ఒక సంస్థ పంగనామాలు పెడుతుంటే, ఏం చేస్తున్నట్టు? విజయ్‌ మల్యా, ఏబీజీ షిప్‌యార్డ్‌... ఇలా బడాచోర్ల పేర్లు ఏమైతేనేం, బ్యాంకులే ప్రజాధనాన్ని ఈనగాచి నక్కల పాలు చేస్తుండడం దుస్సహనీయం.  

ఓ సంస్థ ప్రమోటర్లు దాదాపు 98 డొల్ల సంస్థలు పెట్టి, నిధుల ప్రవాహాన్ని మళ్ళిస్తుంటే, బ్యాంకుల్లోని ఇంటా బయటా ఆడిటర్లు, చివరకు ఆర్‌బీఐ ఆడిట్లు కూడా కనిపెట్టలేదంటే నమ్మలేం. 2013లోనే 8 లక్షల కోట్ల మేర నిరర్థక ఆస్తులు చూపిన ఏబీజీ వ్యాపారంలో తప్పుల వల్ల కాక, కుమ్మక్కుల వల్లే ఈ పరిస్థితి కోరికొని తెచ్చుకుంది. అందుకే, ఈ తాజా కుంభకోణం మన బ్యాంకింగ్‌ వ్యవస్థలో పేరుకున్న లోపాలకు ప్రతీక. ఆడిటింగ్, పర్యవేక్షణ, నియంత్రణ ఎంత సంబడంగా ఉన్నాయో చూపెట్టే నిలువుటద్దం. రాజకీయుల ఆశీస్సులు, వారితో కుమ్మక్కు లేకుండా ఇంతలా జరగవనే సర్వసాధారణ అభిప్రాయానికి సరికొత్త బలం. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పంతా మరొకరిపై నెట్టే బదులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి, కఠినచర్యలు తీసుకోవాలి. ఇకపై, ప్రమోటర్లనే కాక బ్యాంక్‌ అధికారులు, ఆడిటర్లు, పర్యవేక్షక సంస్థలను కూడా జవాబుదారీ చేయాలి. లేదంటే ఇలాంటి మోసాలు యథేచ్ఛగా సాగిపోతూనే ఉంటాయి. తస్మాత్‌ జాగ్రత్త! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top