ఫ మాజీ ఎంపీ భరత్‌రామ్ ఆగ్రహం
ఫ వైఎస్సార్ సీపీ నేత అక్రమ అరెస్ట్‌పై
పోలీస్ స్టేషన్ ముందు నిరసన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం 48వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమారపు రాజ్యలక్ష్మి భర్త మనోజ్ కుమార్‌ను బుధవారం రాత్రి మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలిసిన భరత్ వెంటనే మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మనోజ్‌కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. మనోజ్ కుమార్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించగా, ఆయన వద్ద రూ.45 వేలు దొరికాయని సమాధానం చెప్పారు. భరత్‌రామ్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రూ.50 వేలు వరకు ఉండవచ్చనే కనీస నియమం మీకు తెలియదా అని ప్రశ్నించారు. బ్యాంకు నుంచి డ్రా చేసుకుని జేబులో పెట్టుకున్న డబ్బులు ఉంటే దాన్ని సాకుగా చెప్పి అరెస్టు చేస్తారా అన్నారు. టీడీపీ నాయకులు రూ.కోట్ల పంచిపెట్టినా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పోలీసులు అంటే ప్రజల రక్షకులు కానీ భక్షకులు కాదని హితవు పలికారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నినాదాలు చేశారు. విషయం తెలిసిన ఏఎస్పీ తరుణ్ పహ్వా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని భరత్‌తో మాట్లాడి సర్ది చెప్పారు. అనంతరం మనోజ్ కుమార్‌ను విడిచిపెట్టారు. ఆందోళనలో దాసి కిరణ్, గుడాల జాన్సన్, అనుయాదవ్, కృష్ణవే ణి, పిట్టా రామకృష్ణ, వెంకన్న పాల్గొన్నారు.
విద్యుత్ బిల్లు చెల్లించాలంటూ
నకిలీ సందేశాలు
రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారని, వాటిపై విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత సరఫరా నిలిపివేస్తామని, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తూ కొందరు విద్యుత్ వినియోగదారులకు గుర్తుతెలియని మొబైల్ నంబర్ల నుంచి నకిలీ సందేశాలు వస్తున్నాయన్నారు. ఆ ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్నారు. వాటిలో సూచించిన నంబర్లకు స్పందించొద్దని సూచించారు. విద్యుత్ బిల్లు చెల్లింపులు, విద్యుత్ సరఫరా, ఇతర సేవలకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు లేదా వాట్సాప్ నంబర్ 9493681912ను మాత్రమే సంప్రదించాలన్నారు.
పదో తరగతి పరీక్ష ఫీజు
చెల్లింపు గడువు పెంపు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి డిసెంబర్ 5 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉందన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 నుంచి 9 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో 10 నుంచి 13 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో 14 నుంచి 18 వరకు అవకాశం ఉందన్నారు. ప్రకటించిన తేదీల్లో ఏదైనా ప్రభుత్వ సెలవు దినంగా ఉంటే, తదుపరి పనిదినాన్ని సంబంధిత తేదీగా పరిగణించాలన్నారు. పరీక్ష ఫీజును బీఎస్‌ఈ.ఏపీ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయులు చెల్లించాలన్నారు.


