గోకవరం: గంజాయిని రవాణా చేస్తూ వేగంగా బైక్ నడిపిన ఇద్దరు యువకులు ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుమ్మళ్లదొడ్డికి చెందిన సత్యం ప్రసాద్ (60) బుధవారం గ్రామంలోని ఓ పెట్రోల్ బంకులో తన టీవీఎస్ వాహనానికి ఆయిల్ పోయించుకున్నాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా బైక్పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఆయనను బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన యువకుల వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువకుల వద్ద తనిఖీ చేయగా సుమారు 10 కేజీల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన సీలేరు నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు ఎస్సై పవన్ కుమార్ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిని ఢీకొన్న
ఇద్దరు యువకులు
పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
వారి వద్ద పది కేజీల
గంజాయి లభ్యం


