గోదావరిలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో యువకుడి గల్లంతు

Nov 26 2026 12:36 AM | Updated on Nov 26 2026 12:36 AM

సీతానగరం: మండలంలోని మునికూడలి వద్ద గోదావరిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రాజంపేటకు చెందిన కలిదిండి రాజేష్‌ (19) మునికూడలిలోని రేవులో బుధవారం నీట మునిగిన పడవను నెట్టాడు. ఈ క్రమంలో అదుపుతప్పి గోదావరిలో పడిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు కరుటూరి శ్రీహరిబాబు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్‌కు తండ్రి వెంకయ్య, తల్లి కొండమ్మ, తమ్ముడు వినేష్‌ ఉన్నారు.

నరేష్‌ మృతికి కారకులపై కఠిన చర్యలు

వీరులపాడు(ఎన్టీఆర్‌ జిల్లా): కోళ్ల చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో గిరిజనుడు తిమ్మసర్తి నరేష్‌ను బంధించి చిత్ర హింసలు పెట్టి హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప అన్నారు. వీరులపాడు మండలంలోని గోకరాజుపల్లి గ్రామానికి చెందిన మృతుడు తిమ్మసర్తి నరేష్‌ కుటుంబ సభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటప్ప మాట్లాడుతూ మృతుడి భార్య అఖిల ఫిర్యాదు మేరకు కారకులైన ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయం గోడను ఆనుకుని నిర్వహిస్తున్న పందెం కోళ్ల షెడ్డు వద్ద కోళ్లు దొంగిలించాడనే అనుమానంతో విచక్షణా రహితంగా దాడి చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఎస్టీ కమిషన్‌ అండగా ఉంటుందని, చట్ట ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్టీ కమిషన్‌ తరఫున బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.8.25 లక్షల పరిహారం మంజూరు చేయగా, మొదటి విడతగా 50 శాతం రూ.4,12,500 విడుదల చేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డీఓ అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, పలువురు అధికారులు ఉన్నారు.

వడిశలేరులో చోరీ

రంగంపేట: వడిశలేరు గ్రామంలోని ఓ ఇంటి తాళాలను పగులకొట్టి బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బల్లారి అరుణ, భర్త శ్రీను ఈ నెల 24న తమ ఇంటికి తాళం వేసి, వేరే ఊరికి వెళ్లారు. తిరిగి 25న వచ్చే సరికి ఇంటి తాళం పగులకొట్టి ఉంది. లోపలకు వెళ్లి పరిశీలించగా బీరువాలోని నాలుగు బంగారు ఉంగరాలు (సుమారు 4 గ్రాములు), ఒక బంగారు మంగళసూత్రం (సుమారు 4 గ్రాములు), రెండు వెండి గిన్నెలు (14 తులాలు), రెండు వెండి మొలతాళ్లు (6 తులాలు), ఒక వెండి గ్లాసు (5 తులాలు), ఒక వెండి చెంచా (3 తులాలు) మాయమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుంది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement