● బస్సులోని పది మందికి గాయాలు
● గండేపల్లి వద్ద ఘటన
గండేపల్లి: లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. జాతీయ రహదారిపై గండేపల్లి వద్ద బుధవారం తెల్లవారుజాము సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఢిల్లీ నుంచి బిస్కెట్ల లోడు బయలు దేరిన ఓ ట్రాలీ రాజమహేంద్రవరం సమీపంలోని ఆటో నగర్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ లారీ డ్రైవర్‌కు చిరునామా సరిగ్గా తెలియక గండేపల్లి వరకు వచ్చేశాడు. అనంతరం ఆ విషయాన్ని గుర్తించి, రాజమహేంద్రవరం వెళ్లేందుకు యూ టర్న్ తీసుకో సాగాడు. అదే సమయంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న వెంకట రమణ ట్రావెల్స్ బస్సు ఆ ట్రాలీని ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో పిల్లలు, పెద్దవాళ్లు కలిసి 42 మంది ఉన్నారు. వారిలో 10 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే, రోడ్డు సేఫ్టీ సిబ్బంది, బస్సులోని ఇతర ప్రయాణికుల సహాయంతో 108, హైవే అంబులెన్స్‌ల్లో చికిత్స నిమిత్తం బాధితులను గండేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. మిగిలిన ప్రయాణికులు మరో ప్రైవేటు ట్రావెల్ బస్సులో విశాఖకు బయలుదేరారు. ఏఎస్సై సీహెచ్‌వీ రమణ, తదితరులు సహాయ చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.


