జిల్లాలో వచ్చిన దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో వచ్చిన దరఖాస్తులు

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

మండలం దరఖాస్తులు

రాజమహేంద్రవరం అర్బన్‌ 7,244

రాజమహేంద్రవరం రూరల్‌ 4,940

ఉండ్రాజవరం 2,163

దేవరపల్లి 2,176

కడియం 2,299

సీతానగరం 2,226

కోరుకొండ 2,278

నల్లజర్ల 2,109

మండపేట 3,827

నిడదవోలు 2,739

అనపర్తి 1,886

కొవ్వూరు 2,859

గోపాలపురం 1,630

కపిలేశ్వరపురం 1,995

చాగల్లు 1,616

పెరవలి 2,010

బిక్కవోలు 1,807

రాయవరం 1,872

రాజానగరం 3,327

తాళ్లపూడి 1,366

రంగంపేట 1,529

గోకవరం 1,868

కొత్త పింఛన్లు అంటూ హడావుడి చేశారు..

ఎన్నో ఆశలు చూపించారు.. ఎందరో వృద్ధులు, వికలాంగులు,

వితంతువులు వ్యవప్రయాసల కోర్చి ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు

అందించారు.. ఇంత హడావుడి చేస్తున్నారంటే, వెంటనే అర్హులకు మేలు చేకూర్చుతారని అంతా భావించారు. చివరికి ఈ నెలకు ఇచ్చేది లేదంటూ బాబు షాక్‌ ఇచ్చారు.. స్థానిక ఎన్నికల వేళ కొత్త పింఛన్ల తంతు హైడ్రామాగానే సాగుతోందని అంతా గుర్రుమని ఉన్నారు.

● కొత్త పింఛన్లంటూ హడావుడి

● ఈ నెలకు లేవంటూ

చేతులెత్తేసిన చంద్రబాబు

● స్థానిక ఎన్నికల వేళ డ్రామా

అని తేలిపోయిన వైనం

● నిబంధనల కొర్రీతో చాలా

దరఖాస్తుల తిరస్కరణ

● 55,766 మంది దరఖాస్తుదారుల పరిస్థితి ప్రశ్నార్థకం

సాక్షి, రాజమహేంద్రవరం: దరఖాస్తు చేసుకున్నాం.. ఈ నెల పింఛన్‌ వచ్చేస్తుంది.. కుటుంబానికి ఆర్థిక భరోసా దక్కుతుందని ఆశగా ఎదురు చూసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేదు కబురు చెప్పారు. కొత్త పింఛన్లు ఈ నెల ఇవ్వడం లేదని ప్రకటించడంతో కోటి ఆశలతో నిరీక్షించిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల హామీలను పూర్తిగా గాలికొదిలేసిన విషయం తెలిసిందే. దీంతో ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ తేటతెల్లమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పడవ నిలువునా మునిగిపోతుందని భావించిన బాబు కొత్త పింఛన్ల డ్రామాకు తెర తీశారు. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని, ఓటర్ల దృష్టి మళ్లించేందుకు ఈ ఎత్తుగడ వేశారు. అధికారం చేపట్టిన తర్వాత 27 నెలల్లో ఒక్కరికీ కొత్త పింఛన్‌ ఇవ్వకుండా, ఎన్నికల భయంతోనే పింఛన్లు అంటున్నాడని, దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఎవరికీ మేలు చేయరని అందరూ అనుమానించారు. ఆ అనుమానాలే ఇప్పుడు బలాన్ని చేకూర్చుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. మధ్యలో సెలవు రోజులు మినహాయిస్తే అర్హులకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం 9 రోజుల వ్యవధి ఇచ్చారు. అనంతరం సెప్టెంబర్‌ 17 నుంచి ప్రాథమిక పరిశీలన, 22 నుంచి 24 వరకు క్షేత్రస్థాయి పరిశీలన, తదుపరి అర్హత నిర్ధారణ ప్రక్రియ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో 55,766 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారంతా నెల నెలా కొంత ఆర్థిక భరోసా దక్కుతుందని భావించారు. మరోవైపు 9 రోజుల గడువు సరిపోక పలువురు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడం, ఆన్‌లైన్‌ ప్రక్రియ, ఈ–కేవైసీ, ఇతర వివరాల సమర్పణలో ఇబ్బందులు ఎదురయ్యాయని వాపోయారు. ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు నిర్ణీత వ్యవధిలో దరఖాస్తు అందక ఇచ్చిన గడువు ముగిసింది. వారంతా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు వచ్చి తమ దరఖాస్తులు కూడా పరిశీలించాలని అధికారులను వేడుకొంటున్నారు. అయినా వారికి భరోసా దక్కడం లేదు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి వారు పింఛన్ల కోసం దరఖాస్తులు ఇస్తున్నా, వాటిని అర్జీల లెక్కల్లో చూపకపోవడం గమనార్హం.

నిబంధనల కొర్రీ..

నానా అవస్థలు పడి దరఖాస్తు చేసుకున్నామని.. ఇప్పుడు అసలు పరీక్ష మొదలైందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలనలో భాగంగా వివిధ ధ్రువపత్రాలు సమర్పించినప్పటికీ చిన్న కారణాలతో దరఖాస్తులను పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకునేందుకు పది రోజులే అవకాశమివ్వడం.. మరోవైపు దరఖాస్తు చేసిన తర్వాత నిబంధనల కొర్రీలతో తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా కొత్తగా పింఛన్‌ మంజూరు అవుతుందో.. లేదో తెలియక అయోమయం నెలకొందని ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్‌ 1 నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడంతో కుటుంబానికి ఆసరాగా ఉంటుందని, మందుల ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశించామని.. ఇప్పుడూ చంద్రబాబు మొండిచేయి చూపారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. మరోవైపు వేర్వేరు కారణాలతో ఇప్పటికే ఆరు వేలకుపైగా దరఖాస్తులు తిరస్కరించారని విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement