మరో స్వాతంత్య్ర పోరాటానికి శ్రీకారం చుట్టాలి | - | Sakshi
Sakshi News home page

మరో స్వాతంత్య్ర పోరాటానికి శ్రీకారం చుట్టాలి

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

● పాత పద్ధతిలో ఎన్నికలతో భద్రత

● దండి మార్చ్‌ వద్ద సత్యాగ్రహ నిరసన దీక్ష

● పాల్గొన్న మార్గాని భరత్‌రామ్‌,

అఖిల పక్ష నాయకులు

రాజమహేంద్రవరం సిటీ: దేశంలో ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేయకపోతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం కంబాలచెరువు దండి మార్చ్‌ విగ్రహాల వద్ద అఖిలపక్ష పార్టీల ఆందోళనలో భాగంగా గాంధీజీ స్ఫూర్తితో సత్యాగ్రహ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు చోరీ అంశం దేశాన్ని కుదిపేస్తోందని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇప్పటికీ పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. భారతదేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, బీహార్‌, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. యువత తలుచుకుంటే దేశంలో ఏదైనా సాధ్యమేనని, ఆ యువతలో ఇప్పటికే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగరం విషయానికి వస్తే ఒక్క నెలలో ఆరు హత్యలు జరిగాయని, దీనిని బట్టి శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషన్‌ను మళ్లీ పాత పద్ధతిలోనే సుప్రీంకోర్టు సీజేఐ, ప్రధాన మంత్రి, లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌ ఎన్నుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌, వామపక్ష నాయకులు టి.అరుణ్‌, కొండ్రపు రాంబాబు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు గుర్రం గౌతమ్‌, వాసంశెట్టి గంగాధరరావు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement