దేవరపల్లి: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బర్తరఫ్ చేయాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి. శుక్రవారం దేవరపల్లిలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, సర్ ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బస్టాండ్ నుంచి గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకుడు ఎం.సుందర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మోదీ జేబు సంస్థగా మారిందని విమర్శించారు. దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను సర్ ప్రక్రియ ద్వారా తొలగించారని ఆరోపించారు. తొలగించిన ఓట్లన్నీ దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, బలహీనవర్గాలకు చెందినవేనని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనే కుట్ర ఇందులో దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి జ్యేష్ఠ సతీష్, డీసీసీ అధ్యక్షుడు బోడ వెంకట్, పీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు దుగ్గిన గంగాధర్, పచ్చా రాంగోపాల్, సీపీఎం నాయకులు కె.రత్నాజీ, బేతాళ్ల శ్రీనివాస్, పిన్నమనేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మద్యం షాపులకు దరఖాస్తుల
గడువు పొడిగింపు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో నాలుగు మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి వై.శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. 7న దరఖాస్తులను పరిశీలించి, 8న రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామన్నారు. మద్యం షాపుల నిర్వహణకు పర్మిట్ రూమ్ లైసెన్సు కూడా తప్పనిసరి అని అన్నారు.
మహాత్మా.. ‘కూటమి’కి
మంచి బుద్ధినివ్వు
కపిలేశ్వరపురం: మహాత్మా.. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్దిని ప్రసాదించి తమ సమస్యలను పరిష్కరించేలా చేయాలంటూ వీఆర్‌ఏలు శుక్రవారం కపిలేశ్వరపురంలో నిరసన తెలిపారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు స్థానిక గ్రంథాలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. సంఘ మండల కమిటీ అధ్యక్షుడు పలివెల నాగేశ్వరరావు, కార్యదర్శి కొల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు అదపాక శివప్రసాద్, సహాయ కార్యదర్శి ముమ్మిడివరపు జానికిబాబు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న తమ ఆందోళనను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు.


