గునపాలు, కర్రలు, ఇటుకలతో దాడి | - | Sakshi
Sakshi News home page

గునపాలు, కర్రలు, ఇటుకలతో దాడి

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

● జి.దొంతమూరులో కూటమి

నాయకుల దురాగతం

● వైఎస్సార్‌ సీపీ నాయకుడు, సోదరుడు, వదినపై తెగబడిన వైనం

● తండ్రి ఇంటిని ధ్వంసం

చేశారంటూ బాధితుల ఆవేదన

అనపర్తి: రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో కూటమి నాయకులు రాక్షస దాడికి ఒడిగట్టారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముత్యం వీరబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణమూర్తి, సూర్యవేణి దంపతులపై కర్రలు, గునపాలు, ఇటుకలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. కూటమి నాయకులు దుర్ఘన పుల్లారావు, దుర్ఘన త్రిమూర్తులు, దుర్ఘన అన్నవరం తదితరులతో పాటు సుమారు 60 నుంచి 70 మంది ముత్యం వీరబాబు తండ్రి రామచంద్రయ్య ఇంటిని ధ్వంసం చేసేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. విషయం తెలుసుకున్న వీరబాబు, ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ముందే వేసుకున్న పథకం ప్రకారం వారిపై కూటమి నాయకులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా..

తన తండ్రి ముత్యం రామచంద్రయ్యకు, దుర్ఘన పుల్లారావుకు మధ్య కొంత కాలంగా ఇంటి వివాదం ఉందని వీరబాబు చెప్పారు. ఈ వివాదంలో కోర్టు తమ తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఇంటి నుంచి వెళ్లగొడతామని, ఇంటిని కూల్చేస్తామని, అడ్డు వస్తే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పారు.

పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా..

తమపై దాడికి కుట్ర జరుగుతోందన్న సమాచారం ఉందంటూ మూడు నాలుగు రోజులుగా రంగంపేట ఎస్సై దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించలేదని వీరబాబు ఆరోపించారు. గురువారం రాత్రి టోల్‌ ఫ్రీ నంబరు 100కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించగా, శుక్రవారం ఉదయం పోలీసులు తన తండ్రి వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో వ్యక్తులు వచ్చి తమపై దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేశారని తెలిపారు. పోలీసులు ముందుగా స్పందించి, తగిన భద్రత కల్పించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి పరామర్శ

దాడిలో గాయపడిన ముత్యం వీరబాబు, ముత్యం సత్యనారాయణమూర్తి, ముత్యం సూర్యవేణిని వైఎస్సార్‌ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి శుక్రవారం రాత్రి అనపర్తి ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి, అసలు కారణాలను, దాడికి పాల్పడిన వారి పాత్రను, ఇంటి ధ్వంసానికి సంబంధించిన అంశాలను నిష్పక్షపాతంగా తేల్చి, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో అనపర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రంగంపేట మండల ఇన్‌చార్జి నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement