ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 4,10,245 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.10 అడుగులకు చేరుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో, శుక్రవారం సాయంత్రం మిగులు జలాల విడుదలను పెంచారు. ఎగువన భద్రాచలంలో 20.20 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి శనివారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను అక్టోబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం పంపిణీ చేస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,65,945 మంది లబ్ధిదారులకు రూ.117.19 కోట్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ ఒకటో తదేఈ ఉదయం బ్యాంకుల నుంచి నగదు సమకూర్చుకుని, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ సమయం మార్పును లబ్ధిదారులకు ముందుగానే తెలియజేసి, పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


