చింతూరు: మండలంలోని లక్కవరం ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఫినాయిల్ తాగినట్లు తెలిసింది. పాఠశాలలో గురువారం జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం ఆమె తండ్రితో కలసి పాఠశాలకు రాగా తండ్రి వెళ్లిన కొద్దిసేపటికి ఆమె డార్మెటరీలో వున్న ఫినాయిల్ తాగినట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను తొలుత సమీపంలోని తులసిపాక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి చింతూరు సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించినట్లు సమాచారం. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించగా ఆమె కోలుకున్నట్లు తెలిసింది. కాగా ఆమె ఫినాయిల్ తాగడానికి కారణాలు తెలియరాలేదు. పాఠశాల ప్రిన్సిపాల్ దిలీప్‌సింగ్‌ను వివరణ కోరగా తాను ప్రస్తుతం అరకులో వున్నానని, పాఠశాలకు వచ్చిన అనంతరం ఈ ఘటనపై సమాచారం సేకరిస్తానని తెలిపారు.
కోలుకుంటున్న క్షతగాత్రులు
తుని రూరల్: బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లి బృందం సభ్యులు కాకినాడలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులలో కోలుకుంటున్నారు. గురువారం తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సును కంటైనర్ డీకొనడంతో జరిగిన ప్రమాదంలో 43 మందికి గాయపడగా 108 అంబులెన్సుల్లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారు మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రులలో చేరారు. స్వల్పంగా గాయపడిన వారు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుంది.
విద్యుదాఘాతంతో
వివాహిత మృతి
తొండంగి: మండలంలోని బెండపూడిలో విద్యుత్‌షాక్ గురై వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం గిడజాం గ్రామానికి చెందిన యర్రా శివాజి, యర్రా జ్యోతి (32) దంపతులు వీరికి 13 ఏళ్ల కుమార్తె సత్య, తొమ్మిదేళ్ల కుమారుడు అనిరుధ్ ఉన్నారు. జ్యోతి స్వగ్రామమైన బెండపూడిలో ఐదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. శివయ్య స్థానికంగా దాబాలో పనిచేస్తుండగా జ్యోతి బెండపూడి వైజంక్షన్ వద్ద ఓ ప్రైవేటు బేకరీ షాపులో పనిచేస్తోంది. శుక్రవారం ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఆ తడి చేతులతో విద్యుత్ మీటర్ వద్ద స్విచ్ ఆన్ చేయగా షాక్‌కు గురై పక్కనే ఉన్న ఇనుప గేటుకు తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జ్యోతి తల్లి సమాచారం మేరకు శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొనడంతో శుక్రవారం సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ ఎస్‌ఐ జె.సతీష్ తెలిపారు. మృతుని వద్ద ఏ విధమైన అధారాలు లభించలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 95534 53333, 0883 2442821 నంబర్లకు వివరాలు తెలియజేయాలన్నారు.


