తండ్రి ఉసురు తీసిన కుమార్తె వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

తండ్రి ఉసురు తీసిన కుమార్తె వివాహేతర సంబంధం

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

చేపల చెరువు లీజుదారుని హత్య కేసులో వీడిన మిస్టరీ

నిందితుడు జయబాబు అరెస్టు

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరం సమీపంలో చేపల చెరువు లీజుదారు హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంపై తండ్రి మందలించాడని అతడి కుమార్తె నాగలక్ష్మి తన ప్రియుడు వ్యాన్‌ డ్రైవర్‌ జయబాబుతో కలసి ఈ పథకం పన్నినట్టు పోలీసులు తెలిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పైడి చింతపర్రు గ్రామానికి చెందిన మోరి నరసింహారావు (70) ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వితంతువైన చేపల చెరువు లీజుదారు కుమార్తె బలే నాగలక్ష్మి చేపల ఎరువు, మేత తదితరాలతో తరచూ వచ్చే వ్యాన్‌ డ్రైవర్‌ జయబాబుతో ఆరు నెలలుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయం తెలిసి తండ్రి నరసింహారావు ఆమెను మందలించడంతో ప్రియుడు జయబాబుతో కలిసి తండ్రి హత్యకు కుట్ర పన్నింది. హత్య చేస్తే డీజే సౌండ్‌ సిస్టమ్‌ కొని ఇస్తానని, కొంత నగదు ముట్టజెప్పింది. ఇందులో భాగంగా హత్యకు వారం రోజుల ముందే ఆమె తన పింఛను నిమిత్తం స్వగ్రామం కొవ్వాడలంకకు వెళ్లినట్టు కథ అల్లింది. ఆ రోజు అర్ధరాత్రి జయబాబు టి.రాయవరం వచ్చి నరసింహారావును హత్య చేసి రెండు వేలు నగదు, రోల్డుగోల్డు నగలు దోచుకుపోయాడు. అనంతరం వచ్చిన నాగలక్ష్మి రూ.2 లక్షల నగదు, పది గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై సీఐ సూర్య అప్పారావు పర్యవేక్షణలో ప్రత్తిపాడు, అన్నవరం, రౌతులపూడి ఎస్సైలతో మూడు బృందాలుగా దర్యాప్తు ముమ్మరం చేసి సీసీ ఫుటేజీలు, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం, సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా కేసును చాకచక్యంగా ఛేదించి అనకాపల్లి జిల్లా పాయకరావు పేట మండలం పడాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ వీర్ల జయ నాగ వెంకట సత్యనారాయణ అలియాస్‌ జయబాబును ధర్మవరం నుండి వెల్దుర్తి రోడ్డులో శుక్రవారం అరెస్టు చేశారు. నాగలక్ష్మిని అరెస్టు చేయాల్సి ఉంది. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ జి.బింధుమాదవ్‌ అభినందిస్తూ, ప్రకటించిన ప్రోత్సాహక నగదు బహుమతిని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్‌కు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement