వేదిక: గోదారి గట్టుపై రావిచెట్టు నీడ. పొలం పని ముగించుకు వచ్చిన సుబ్బయ్య, చేతిలో పేపరు పట్టుకుని చదువుకుంటున్న జగన్నాథం మధ్య సంభాషణ ఇలా సాగుతోంది...
సుబ్బయ్య: ఏంటోయ్ జగన్నాథం.. ఆ పేపర్లోకి అలా ముఖం దూర్చేసి మరీ చూసేస్తున్నావ్? ఏదైనా వింత రాశారా ఏవిటి?
జగన్నాథం: వింతేంటి బాబాయ్.. ఎమ్మెల్యే గారి అల్లుడు బియ్యం బొక్కేస్తున్నాడుట! నీలాంటోళ్ల కడుపు కొట్టి, ఏటా కోట్లు వెనుకేసుకుంటున్న ముచ్చట్లే రాశారిక్కడ!
సుబ్బయ్య: అల్లుడంటే ఎవరయ్యా..?
ఏం చేశాడేంటి?
జగన్నాథం: మన రాజమండ్రి పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారున్నారా... ఆయన రత్నం లాంటి అల్లుడు గారు! ఉచితంగా పేదోళ్లకు పంచుతున్న రేషన్ బియ్యాన్ని చౌకగా నొక్కేసి సన్నబియ్యంలో కలిపేసి అమ్మేస్తున్నాట్ట.
సుబ్బయ్య: బాబోయ్! రేషన్ బియ్యమా? ప్రతీ నెలా పేదలకు పంచే బియ్యంలోనూ దందాయేనా...? అదెట్టా సాధ్యమోయ్ జగన్నాథం?
జగన్నాథం: అదో పెద్ద స్కెచ్ బాబాయ్! ఎమ్మెల్యే గారి అల్లుడు ప్రతి మండలానికి ఐదుగురు ఏజెంట్లను పెట్టేశాట్ట. వాళ్ల మనుషులు ఊళ్ల మీద పడి కార్డున్నవాళ్ల దగ్గర కిలో రూ.15 చొప్పున కొనేస్తున్నారట. దాని మీద రూ.ఐదేసుకుని ఏజెంట్లకి రూ.20 చొప్పున అమ్మేస్తున్నార్ట. ఆ ఏజెంట్ల నుంచి కిలోకి రూ.24 చెల్లించి ఎమ్మెల్యే అల్లుడు కొనేసి అదే నియోజకవర్గంలో రైస్ మిల్లులకు తోలేస్తున్నార్ట బాబాయ్.
సుబ్బయ్య: పేదల బియ్యాన్ని మిల్లులో ఏం చేస్తున్నార్రా అబ్బాయ్..?
జగన్నాథం: ఇక్కడే అసలు కథ నడుస్తోంది బాబాయ్. రేషన్ బియ్యాన్ని ఆ మిల్లుల్లో తెగ పాలిష్ పట్టేసి, సన్నబియ్యంలో కలిపి ప్యాకింగ్ చేసేసి కిలో రూ.50కి పైనే బయట అమ్మేస్తున్నారుట!
సుబ్బయ్య: ఓర్నాయనో! పేదోడికి ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని తెల్లగా మెరిపించి, మనకే మళ్లీ యాభై రూపాయలకి అమ్ముతున్నారా..? ఇది బియ్యం దందానా లేక మాయాజాలమా?
జగన్నాథం: మాయాజాలమే బాబాయ్! మన నియోజకవర్గంలోని కార్డుదారులకు నెలకు సుమారు 850 టన్నుల బియ్యం వస్తుంటే వాటిలో నుంచి 600 టన్నుల బియ్యం వాళ్లే కొనేస్తున్నారట. అన్ని ఖర్చులు పోను అల్లుడు గారికి నెలకు ఒకటీ... రెండూ... కాదు ఏకంగా ఒక్క రూ.కోటీ 20 లక్షలపైనే మిగులుతున్నాయట!
సుబ్బయ్య: రామ రామ! నెలకు రూపాయ్ రెండు రూపాయలు కూడబెట్టడానికి మేం పొలాల్లో నడుములు విరగ్గొట్టుకుంటుంటే, ఎమ్మెల్యే అల్లుడైనందుకు బియ్యం బొక్కేసి ఏకంగా కోట్లు వెనుకేసుకుంటున్నాడా? ‘అన్యాయాన్ని ప్రశ్నిస్తాం’ అని ఎన్నికల వేళ ఊరంతా డప్పులు కొట్టినోళ్లు వీళ్లే కదా?
జగన్నాథం: ప్రశ్నించడం అంటే వాళ్ల ఉద్దేశం వేరే బాబాయ్... ‘బియ్యం ఎక్కడ దొరుకుతాయి? లాభం ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించుకుని దందా చేసుకోవడం అన్నమాట!
సుబ్బయ్య: ఏం చేస్తాంలే జగన్నాథం.. మన పాలిట బియ్యం పాలిష్ అయిపోతున్నాయి, వాళ్ల పాలిట కోట్లు కురిపిస్తున్నాయి... పద, ఆ సల్లని గోదావరి నీళ్లు తాగి పొలం పనైనా చూసుకుందాం!
– సాక్షి, రాజమహేంద్రవరం


