సాక్షి, రాజమహేంద్రవరం, పెరవలి, కపిలేశ్వరపురం: అరటి తోటల పచ్చదనంతో కళకళలాడే జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రస్తుతం అన్నదాతల మోముల్లో ఆందోళన కనిపిస్తోంది. పంటకు రక్షణగా నిలవాల్సిన పంటల బీమా పథకం ప్రభుత్వం తాజా నిర్ణయంతో నిరుపయోగంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 12,500 ఎకరాల్లో 20 వేల మంది రైతులు అరటి సాగు చేస్తున్నారు. ఎకరా సాగు కోసం విత్తనం నుంచి గెల కోసే వరకు లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అకాల వర్షాలు, ఈదురు గాలులు వస్తే గెలలతో సహా తోట నేలమట్టమై రైతులు నిండా మునిగిపోతున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆశించిన బీమా పథకం ఇప్పుడు అక్కరకు రాకుండా పోతోంది.
వరుణ, వాయుదేవుల దయతోనే
ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం బీమా కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అరటి పంటకు బీమా వర్తించాలంటే ఎకరాకు ఏకంగా రూ.5 వేల ప్రీమియం రైతే స్వయంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతున్న సగటు రైతుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ప్రీమియం కట్టడం పెనుభారంగా మారింది. పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసే చిన్న, సన్నకారు రైతులు రూ.50 వేలు కేవలం బీమా కోసమే ఎలా వెచ్చించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని మోయలేక జిల్లాలోని అరటి రైతులు బీమా చేయించేందుకు చేతులెత్తేశారు. జిల్లాలో మొత్తం 12,500 ఎకరాల్లో అరటి సాగవుతుంటే, ఇప్పటి వరకు కేవలం 500 ఎకరాలకు మాత్రమే రైతులు బీమా చేయించగలిగారు. అంటే దాదాపు 96 శాతానికి పైగా పంట రక్షణ లేకుండా గాలి, వానల దయపైనే ఆధారపడి ఉంది.
వైఎస్ జగన్ పాలనలో ఉచితం
ఈ పరిస్థితుల్లో అరటి రైతులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలైన ‘ఉచిత పంటల బీమా’ పథకం కింద రైతుపై పైసా భారం పడకుండా, మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరించేది. ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే నేరుగా పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. అటువంటి వెసులుబాటును చంద్రబాబు రద్దు చేసి, నేడు ఎకరాకు రూ.5 వేల ప్రీమియం బాదడంతో అరటి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రీమియం గతంలో మాదిరిగా ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై కూటమి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమ చేతుల్లో ఏమీ లేదని... అంతా బీమా సంస్థల చేతుల్లోనే ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు.
ప్రీమియం చెల్లింపుపై అరటి రైతుల ఆవేదన
ఎకరాకు రూ.5 వేలు చెల్లించలేమని గగ్గోలు
గత ప్రభుత్వ పద్ధతినే
అనుసరించాలని విజ్ఞప్తి
జిల్లాలో 12,500 ఎకరాల్లో సాగు
కేవలం 500 ఎకరాలకే ప్రీమియం చెల్లింపు


