● డీఎస్సీ అక్రమాలపై
ప్రజలకు సమాధానం చెప్పాలి
● మంత్రి లోకేష్‌కు
మాజీ మంత్రి వేణు డిమాండ్
రాజమహేంద్రవరం రూరల్: బీసీ వర్గాలకు దక్కాల్సిన కోటాను వారికి దూరం చేసింది చంద్రబాబు, ఆ పార్టీ నాయకులేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బీసీలకు అన్యాయం చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వ్యాఖ్యానిస్తున్నారని, చంద్రబాబు బీసీలకు చేసిన ద్రోహంపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, లోకేష్ వేదిక ఏర్పాటు చేస్తే ద్రోహం, కుట్రల గురించి మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంగ్ల్లిషు మీడియం, ఐబీలు వంటి వాటిని తీసుకురావడం ద్వారా బీసీ వర్గాలకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేలు చేశారన్నారు. కానీ కులవృత్తుల్లో మాత్రమే బీసీ వర్గాలు కుమిలిపోవాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నించిందన్నారు. దీంతో జగన్ బీసీలకు చేసిన మేలు వారికి ద్రోహంగా కనిపిస్తోందని వివరించారు. ప్రతిసారీ బీసీలను వాడుకుని మోసం చేసింది చంద్రబాబేనన్నారు. తాజాగా 34 శాతం రిజర్వేషన్లు అంటున్నారని, 176 జీవోను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లింది టీడీపీ వారేనని గుర్తుచేశారు. తద్వారా 24 శాతానికి బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి వారే కారణమయ్యారన్నారు. అయినప్పటికీ జగన్ మాత్రం రిజర్వేషన్లను మీరి బీసీలకు సీట్లు కేటాయించి, అత్యున్నత పదవులు కూడా ఇచ్చారని వేణు గుర్తుచేశారు.
అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు భిన్నంగా 34 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో బీసీలకు చెప్పాలని వేణు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేయాలన్నారు. ఇప్పటికై నా లోకేష్ నిజాలు మాట్లాడాలని, తండ్రీ కొడుకులు బీసీలను అవమానిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులపై మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి వెనక్కి చూసుకోవాలన్నారు. కులవృత్తులు అంతరించి పోతున్నాయన్నారు. బీసీ వర్గాలకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారని చెప్పారు. ఆయనను మీరు బీసీల ద్రోహి అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతరించిపోయే కులవృత్తుల్లోనే కుమిలిపోండి అంటూ చెప్పిన చంద్రబాబు అండ్ కోయే ద్రోహులని చెల్లుబోయిన వేణు స్పష్టంచేశారు.
డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేయడానికే...
డీఎస్సీ–2025 అక్రమాల డొంక కదులుతోందని, ఒకొక్కటీ బయటికి వస్తున్నాయని వేణు అన్నారు. దీనిని డైవర్ట్ చేయడానికే లోకేష్ బీసీలపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారన్నారు. బీసీలకు మేలు చేసిన వైఎస్ జగన్‌ను ద్రోహి అని, కీడు చేసిన చంద్రబాబు గొప్పవాడని ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇంత అడ్డగోలుగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగితే సమాధానాలు చెప్పడం మానేసి ఎదుటివారిపై ఆరోపణలు చేసి లబ్ధిపొందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా పక్షాన నిలబడి ప్రతిపక్షం పోరాడుతోందన్నారు. ప్రజా తోడ్పాటు తోనే యువతకు న్యాయం జరుగుతుందని వేణు స్పష్టంచేశారు. ఇది దగా డీఎస్సీ అని తమ పార్టీ ఎప్పుడో చెప్పిందని, ఇప్పుడు ఒక్కో అక్రమం వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని మంత్రి లోకేష్‌కు వేణు సవాల్ విసిరారు.


