సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ)గా ఎంయూవీ మనోహర్ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని డీపీటీఓ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన ఇక్కడే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్)గా విధులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని రాజోలు, అమలాపురం, కాకినాడ డిపోల మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ డీపీటీఓగా విధులు నిర్వహిస్తూ, బదిలీపై ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రయాణికులకు అనుగుణంగా మెరుగైన సేవలు అందిస్తాననని పేర్కొన్నారు. ఆయనకు జిల్లాలోని పలువురు డిపో మేనేజర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయ సిబ్బంది ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఉత్తమ
ఉపాధ్యాయునిగా రవికుమార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వీటీ జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు నల్లి రవికుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం తరగతి గదికే పరిమితం చేయకుండా, విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ముందుకు సాగడం, ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకుడిగా, మరోవైపు పాఠ్యపుస్తక రచయితగా, డిజిటల్ బోధకుడిగా, విద్యార్థుల ప్రతిభకు మార్గదర్శిగా, పరిశోధకుడిగా, కవిగా, అనువాదకుడిగా, నాటక రచయితగా ఆయన బహుముఖ సేవలు అందించడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ఆయన అమరావతిలో అందుకోనున్నారు.
ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా వివిధ మండలాల నుంచి 99 మంది ఎంపికయ్యారు. గురుపూజోత్సవం సందర్భంగా స్థానిక వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో శనివారం ఉదయం 10 గంటలకు వారిని సన్మానించనున్నారు. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. పురస్కార గ్రహీతలు ఉదయం 9 గంటలకు ఆనం కళా కేంద్రానికి చేరుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు.
పరిశోధనా స్థానం భూమిని బదలాయించొద్దు
సాక్షి, అమలాపురం: అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం (హెచ్‌ఆర్‌ఎస్) భూమిని ఎంఎస్‌ఎంఈ పార్కుకు బదలాయించవద్దని, కేవలం పరిశోధనలకే వినియోగించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్టు అమలాపురంలో శుక్రవారం ఆయన మీడియాకు చెప్పారు. 1972లో స్థాపించిన ఈ పరిశోధన స్థానం ఐదు దశాబ్దాలుగా కొబ్బరి అభివృద్ధిలో కీలకంగా ఉందన్నారు. హైబ్రీడ్ వంగడాల మూల్యాంకనం, జెర్మ్ ప్లాజం పరిరక్షణ, చీడపీడల నివారణలో శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. గోదావరి జిల్లాల్లో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందన్నారు.


