ఫ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో అనర్థాలు
ఫ రసాయనాలతో పెనుముప్పు
ఫ మట్టి ప్రతిమలే మేలంటున్న
పర్యావరణవేత్తలు
నిడదవోలు: గణనాథులు కొలువు దీరే వినాయక చవితి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. మరోవైపు వేడుకలకు ఆయా ఆలయ కమిటీలు సన్నద్ధమవుతున్నాయి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దని, వీటివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఈ విగ్రహాల తయారీలో వినియోగించే రసాయనాల కారణంగా నీటిలోని జలాచరాలకు ప్రమాదం పొంచి ఉంది. ఆ రసాయనాల నీటిని తాగే జీవరాశులు ప్రమాదాల బారిన పడతాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మన్ను విగ్రహాలే మేలని నిపుణులు అంటున్నారు.
జోరుగా అమ్మకాలు
రాజస్థాన్, హైదరాబాద్, విజయవాడ, వరంగల్, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు, వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో భారీ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అడుగు నుంచి 12 అడుగుల ప్రతిమలను తీర్చిదిద్దిస్తున్నారు. పర్యావరణం కలుషితమవుతుందని సామాజికవేత్తలు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా, ఈ విగ్రహాల వాడకం మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా అందమైన ఆకృతుల్లో నేత్రపర్వంగా రసాయన రంగులు దిద్ది విగ్రహాలు ఆకర్షించడంతో ఆయా ఆలయ కమిటీలు వాటికే మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది గణపతి విగ్రహాలను గోదావరి నదిలో, కాలువల్లో నిమజ్జనం చేస్తున్నారు.
జీవకోటికి పెనుముప్పు
వినాయక విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగుల్లో మెగ్నీషియం, గంధకం, కాడ్మియం, జిప్సం, సీసం వంటి రసాయన పదార్థాలు ఉండడం వల్ల విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కరగవు. ఫలితంగా నీటి కాలుష్యం పెరుగుతోందని, ఈ రసాయనాల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇది జీవకోటికి పెనుముప్పుగా పరిగణస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యత తీసుకోవాలి
మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి. కాలుష్యాన్ని మిగిల్చే వాటికన్నా మట్టి విగ్రహాలు వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వారమవుతామన్న భావన అందరిలో కలిగించాలి. ఆధునిక హంగులు, రసాయనాలతో కూడిన రంగుల విగ్రహాలను పూజించడం సమాజానికి హాని తెలియజెప్పాలి.
అవగాహన లోపంతో..
లంబోదరుడి విగ్రహాలు ఆధునిక హంగులు, ఆకర్షిణీయమైన రంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి పర్యావరణ కాలుష్యానికి మరింత ఊతమిస్తాయి. మట్టి గణపతులే మేలని, వాటిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి, పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, పలువురు పర్యావరణ హితులు సమావేశాలు, సదస్సులు నిర్వహించి ప్రచారం చేస్తున్నా పెద్దగా మార్పు కనబడడం లేదు. ప్రజల్లో అవగాహన లోపంతో నూటికి 90 శాతం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూపొందించినవే కనబడుతున్నాయి.


