వన్యప్రాణి చట్టాల అమలుపై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణి చట్టాల అమలుపై వర్క్‌షాప్‌

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

రాజానగరం: లాలాచెరువులోని ఏపీ స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సహకారంతో ‘వన్యప్రాణి చట్టాలు – అమలు’పై మంగళవారం వర్క్‌షాప్‌ జరిగింది. రెండు రోజులపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో వన్యప్రాణి రక్షణ చట్టం– 1972, సవరణలు, సాక్ష్యాల సేకరణ, నేరాల గుర్తింపు, సీజ్‌ చేసే విధానం, కోర్టు ప్రక్రియలు, ప్రాసిక్యూషన్‌, మానవ– వన్యప్రాణి సంఘర్షణల చట్టపరమైన అంశాలు, అమలులో సాంకేతిక వినియోగం వంటి కీలక మాడ్యూల్స్‌పై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కలిగించి, వారిలో నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అకాడమీ డైరెక్టర్‌ బి.విజయ్‌కుమార్‌ తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా గవర్నెన్స్‌, లా అండ్‌ పాలసీ డైరెక్టర్‌ డాక్టర్‌ విశేష్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.

అదుపు తప్పిన కారు

దంపతులకు గాయాలు

గంగవరం: 516 జాతీయ రహదారిపై గంగవరం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అడ్డతీగల మండలం ధాన్యంపాలెం గ్రామానికి చెందిన కురసం బాలుదొర (38), అతని భార్య రామతులసి కలసి కారులో బయలుదేరి గంగవరం మండలం పండ్రపొట్టిపాలెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగవరం– అడ్డపల్లి చినవీధి మధ్యలో కారు ముందు టైరు ఫంక్చర్‌ కావడంతో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. కారు నడుపుతున్న బాలుదొరకు రెండు కాళ్లకు గాయాలు కాగా, రామతులసికి తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. గంగవరం ఎస్సై ఎస్‌.వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆటోలో గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై వెంకయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోదారి గట్టుపై కారు బోల్తా

కపిలేశ్వరపురం: గౌతమి గోదావరి గట్టుపై మంగళవారం కపిలేశ్వరపురం– తాతపూడి మధ్య కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని అంగర పోలీసులు తెలిపారు. కోరుమిల్లి వైపు నుంచి జొన్నాడ వైపునకు వెళ్తుండగా కారు బోల్తా పడినట్టు పలువురు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న తణుకుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలు కాగా, ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement