అమలాపురం రూరల్: మండలంలోని బండారులంక సచివాలయం–1లో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కరిబండి శివశంకర్ 75 మందికి పంపిణీ చేయాల్సిన రూ.3.11 లక్షల పింఛన్ల నగదుతో పరారయ్యాడు. మంగళవారం ఉదయం నుంచి ఒక్కరికి కూడా పింఛను పంపిణీ చేయకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మధ్యాహ్నం 12 గంటలైనా పింఛను పంపిణీకి రాకపోవడంతో లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
అనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్ తెలిపారు. ఈ ఘటన బలభద్రపురంలో జరిగింది. బాలవరం గ్రామానికి చెందిన ఎం.మరిడయ్య తన మోటార్ సైకిల్‌పై బలభద్రపురం నుంచి రాజానగరం వెళ్తున్నాడు. ఈ సమయంలో అటువైపు వెళుతున్న లారీ వేగంగా వెనుక నుంచి మరిడయ్యను ఢీకొంది. దీంతో అతని కాలు నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే అతన్ని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న ఆటో
ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. చొప్పెల్ల గ్రామానికి చెందిన పి.ప్రసాద్ తన ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి జాతీయ రహదారిని దాటుతున్నాడు. అంతలో రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వైపు వస్తున్న ఆటో ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు బలమైన గాయాలు కాగా, 108 అంబులెన్స్ సిబ్బంది సత్వరమే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆటో రహదారిపై బోల్తా పడటంతో అందులో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీలు కింద పడిపోగా, అమలాపురానికి చెందిన డ్రైవర్ దుర్గాప్రసాద్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఆలమూరు ఎస్సై జి.నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న కారు : పదహారవ నంబరు జాతీయ రహదారిలోని మడికి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. రావులపాలెం వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు స్థానిక పోస్టాఫీస్ సెంటర్ సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరం బుచ్చయ్య నగర్‌కు చెందిన డ్రైవర్ కుమార్‌స్వామితో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.


