కొబ్బరి రైతుకు పరీక్షా కాలం 1996 నవంబర్ 6న సంభవించిన పెను తుపానుతో మొదలైంది. ఆ తుపానులో సుమారు 80 లక్షల చెట్లు వేర్లతో సహా నేల కూలాయి. పెనుగాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయి చెట్లు జీవచ్ఛవాలుగా మారిపోయాయి. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి కోనసీమ కొబ్బరి రైతులకు ఐదారేళ్లు పట్టింది.
నల్లి తెగులు
కొబ్బరిని 1998లో నల్లి తెగులు (ఇరియోఫీడ్ మైట్) ఆశించింది. తుపాను కన్నా ఎక్కువ నష్టం కలిగించిన ఈ పురుగు పిందెలపై దాడి చేసి, కాయలు చిన్నవిగా మారి, రాలిపోయేలా చేసింది. కొబ్బరి కాయలపై మచ్చలు ఏర్పడటంతో ఒకానొక సమయంలో బొండాలు తాగేందుకు సహితం జనం భయపడ్డారు. దిగుబడి సగానికి పడిపోయింది. దశాబ్ద కాలం పాటు కోలుకోలేని విధంగా కొబ్బరిని దెబ్బ తీసింది. ఇప్పటికీ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంది.


