రూ.10 వేల పింఛనంటూ.. ఉన్నదంతా లాక్కుపోయారు! | - | Sakshi
Sakshi News home page

రూ.10 వేల పింఛనంటూ.. ఉన్నదంతా లాక్కుపోయారు!

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

సామర్లకోట: ఆరు పదుల వయసు.. ఆపై అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు ప్రబుద్ధులు ఓ వృద్ధురాలిని మోసం చేశారు. రూ.10 వేల పింఛను వస్తుందంటూ, ఉన్న రూ.4 వేలు తీసుకుపోయిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. సినీ ఫక్కీలో జరిగిన ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. సామర్లకోటలోని అయోధ్యరామపురానికి చెందిన వృద్ధురాలు కలిగట్ల వీరరాఘవ తన కోడలు మంగతో కలసి నివాసం ఉంటోంది. వృద్ధురాలి కుమారుడు ఇటీవల మృతి చెందడంతో కోడలు వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్‌పై మంగళవారం వారి ఇంటికి వచ్చారు. వితంతు పింఛను విచారణ కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి వచ్చామని చెప్పి.. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తేవాలని కోడలిని బయటకు పంపించారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని పింఛను సొమ్ము ఎంత వచ్చిందని ప్రశ్నించారు. ఆమె రూ.4 వేలు వచ్చిందని చెప్పడంతో.. అదేంటి పింఛను సొమ్ము ప్రభుత్వం పెంచింది కదా అంటూ.. ఆ సొమ్ము తీసుకున్నారు. రేపు సచివాలయం సిబ్బంది రూ.10 వేలు ఇంటికి తెచ్చి ఇస్తారని నమ్మించి వెళ్లిపోయారు. కోడలు వచ్చే సమయానికి వారిద్దరూ లేకపోవడంతో అత్తను ఆరా తీయగా, జరిగిన మోసం తెలిసి లబోదిబోమన్నారు. వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ వచ్చిన వ్యక్తులు పింఛను సొమ్ము రూ.4 వేలతోనే పరారయ్యారని కోడలు మంగ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement