రాజానగరం: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజానగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన వారు భోజన విరామ సమయంలో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏ, ఇతర పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.


