అన్నవరం: పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అయితే ఈ భారం రత్నగిరిపై సత్యదేవునికీ తప్పేలా లేదు. ప్రసాదం తయారీతో పాటు అన్నదాన పథకం నిర్వహణకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఏటా నిత్యావసరాల కొనుగోళ్లకు సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఈ సారి పెరిగిన ధరలతో మరో రూ.ఆరు కోట్ల వరకు ఆదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. పంచదార, యాలకులు, గోధుమల ధర పెరగడంతో సత్యదేవుని ప్రసాదం తయారీకి ఖర్చు ఎక్కువ కానుంది. అలాగే పెరిగిన బియ్యం, నూనెల ధరలతో నిత్యాన్నదాన ప్రసాదంలో భోజనం తయారీ వ్యయం పెరుగుతుంది.
ఆరు నెలలకు టెండర్
అన్నవరం దేవస్థానంలో ఉపయోగించే బియ్యం, పప్పులు, నూనె, కందిపప్పు, పంచదార, నెయ్యి, గోధుమలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ కం వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి అక్టోబర్ ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు టెండర్ వేయడానికి సెప్టెంబర్ 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆయా టెండర్లను తెరచి, తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. మరి ఈ సారి ఎంతకు టెండర్ వెళుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా.. ఏటా రూ.25 కోట్లతో కొనుగోలు చేసే నిత్యావసరాల్లో సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులు, గ్యాస్‌కు రూ.15 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో, నివేదనశాలకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పామాయిల్, కూరగాయలకు రూ.2.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక స్వామివారి వ్రతాల విభాగంలో ఉపయోగించే దీపాల నూనె, అగరవత్తులు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమ, గావంచాలు, జాకెట్ ముక్కల కొనుగోలుకు మరో రూ.మూడు కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు.
పెరిగిన ధరలు
దేవస్థానంలో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు ఆరు నెలల క్రితానికి ఇప్పటికి దాదాపు 30 శాతం పెరిగాయి. ఆ మేరకు సెప్టెంబర్ మూడో తేదీన తెరవనున్న టెండర్లులో కూడా ఆ మేరకు సప్లయిదారులు కోట్ చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిత్యావసర పరిమాణం టెండర్ ధర మార్కెట్ రేటు
వస్తువులు (6 నెలలకు) (6 నెలల క్రితం) (ప్రస్తుతం)
కేజీ రూ.
బియ్యం 180 టన్నులు 42 50 – 60
గోధుమలు 400 టన్నులు 32.50 45 – 50
పంచదార 500 టన్నులు 44 68 – 72
కందిపప్పు 25 వేల కేజీలు 129 160 – 180
పామాయిల్ 2 వేల కేజీలు 130 165 – 170
యాలకులు 800 కేజీలు 2,800 4000
ప్రసాదం, భోజనం తయారీకి
ఏటా రూ.25 కోట్ల ఖర్చు
ఇప్పుడు మరో రూ.6 కోట్లు పెరిగే అవకాశం
3 వరకు టెండర్‌కు గడువు
ఈసారి ఎంత వెళుతుందోనని ఉత్కంఠ


