● రేషన్ డీలర్ల ఆవేదన
● క్యూఆర్ కోడ్ విధానంపై విముఖత
● సాంకేతిక సమస్యలు తప్పవని గగ్గోలు
అంబాజీపేట: ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం తమకు తలనొప్పిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. క్యూఆర్ కోడ్ పద్ధతితో తలనొప్పి తప్పడం లేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకారం చుట్టింది. సంబంధిత ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆపై దుకాణాల వద్దకు సరఫరా అయ్యే బియ్యానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. దీన్ని సెప్టెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అమలు చేయనుంది. అయితే ఈ కొత్త విధానం తమకు ఇబ్బందిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 779 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా 4,58,874 మంది రేషన్ కార్డుదారులు సరుకులు తీసుకుంటున్నారు.
డీలర్ల వ్యతిరేకత
గోడౌన్ల నుంచి స్కానింగ్ ద్వారా రేషన్ షాపులకు బియ్యం చేరుతుంది. డీలర్లు స్కాన్ చేసి ఆపై తమ పీపీఎస్ (పెడ్డీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్) యాప్ ద్వారా సబ్మిట్ చేసి ఈ–పాస్ ద్వారా ఆర్వో జనరేట్ చేసి ట్రాక్ షీట్ చేపట్టాలి. ఇదంతా కష్టతరమని డీలర్లు చెబుతున్నారు. ఎందుకంటే కొందరు డీలర్లకు స్మార్ట్ ఫోన్లు లేవు. వీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కొత్త లింకును పంపిస్తున్నారు. దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో వారికి అవగాహన లేదు. అలాగే బియ్యం బస్తాలను షాపుల వద్దకు దించే హమాలీలు ప్రతి మూటను స్కానింగ్ చేసేందుకు గంటల సమయం పడుతుంది. బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతుంది.
పెరిగిన పనిభారం
చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా రేషన్ డీలర్లపై విపరీతమైన పని భారం పెంచింది. రకరకాల నిబంధనలు విధించడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రతి బియ్యం బస్తాను రెండు సార్లు స్కానింగ్ చేయాలంటూ కొత్తగా నిబంధన తీసుకువచ్చారు. కానీ కిలోకు రూపాయి కమిషన్ తప్ప ఒక్క పైసా కూడా పెంచలేదు.


