అమలాపురం టౌన్: స్థానిక సంస్థలు, చట్ట సభల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగ మహా సంఘటన్ జాతీయ అధ్యక్షుడు నండూరి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్సన్ విత్ డిజబిలిటీ (పీడబ్ల్యూడీ) ఫెడరేషన్, దివ్యాంగ మహా సంఘటన్, కోనసీమ జిల్లా దివ్యాంగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమేష్ హాజరయ్యారు. పీడబ్ల్యూడీ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి దొడ్డిపట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకట ప్రసాద్, దివ్యాంగుల మహా సంఘటన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్ మాట్లాడుతూ దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 50 శాతం రాయితీపై ఏ విధమైన బ్యాంక్ హామీలు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దివ్యాంగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కులు, రాయితీలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల జేఏసీ చైర్మన్ పెనుమాల నాగరాజు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు కొమ్ముల కోటేశ్వరరావు, నల్లమాటి లంకరాజు, కానూరు శంకరరావు, కె.సుబ్రహ్మణ్యం, జి.కొండలరావు పాల్గొన్నారు.


