దేవరపల్లి: నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో బాలిక(13)పై అత్యాచార యత్నానికి పాల్పడిన కొక్కిరిపాటి కిరణ్‌ను ఆదివారం అరెస్ట్ చేసినట్టు నల్లజర్ల స్టేషన్ సీఐ ఆర్‌జే రవికుమార్ తెలిపారు. నిందితుడు కిరణ్‌ను తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లా జైలుకు తరలించినట్టు తెలిపారు.
నిలకడగా
విద్యార్థుల ఆరోగ్యం
కోరుకొండ: దోసకాయలపల్లి గురుకుల వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పితాని కోమల తెలిపారు. ఆదివారం డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌లు, ఏరియా హాస్పటల్, అనపర్తి నుంచి వచ్చిన పీడియాట్రీషియన్లు వసతి గృహాన్ని సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసోలేషన్‌లోని 40 మంది విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆదివారం కొత్తగా అస్వస్థత కేసులు నమోదు కాలేదన్నారు.
జీడీఎస్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి
కొత్తపేట : తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగులందరికీ నెలవారీ పింఛను సౌకర్యం కల్పించాలని జీడీఎస్ యూనియన్ జాతీయ మాజీ అధ్యక్షుడు బీవీ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమలాపురం డివిజన్ జీడీఎస్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం ఆదివారం కొత్తపేట సబ్ పోస్టాఫీసు సమీపంలోని ఆర్ అండ్ బీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. యూనియన్ కొత్తపేట బ్రాంచ్ అధ్యక్షుడు వీ సూర్యరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూ.1.50 లక్షల గ్రాట్యుటీని రూ.5 లక్షలకు పెంచాలని, జీడీఎస్ ఉద్యోగులందరికీ 8 గంటల పనిదినాన్ని కేటాయించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏటా ఒకే రకమైన ఇంక్రిమెంట్లు వర్తింపజేయాలని, కమలేష్ చంద్ర కమిటీ సూచించిన పెండింగ్ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం 15 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వీ సూర్యరాజు, అధ్యక్షునిగా కాశి గోపీచంద్ ఎన్నికయ్యారు. సమావేశంలో అమలాపురం, రాజోలు, కొత్తపేట ప్రాంతాలకు చెందిన జీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.


