● అర్ధంతరంగా నిలచిన వంతెన నిర్మాణం
● మూడేళ్లగా పట్టించుకోని
కూటమి ప్రభుత్వం
● తుపానులు, వరదల వేళ
ప్రజలకు తప్పని తిప్పలు
● పూర్తయితే అన్ని విధాలా అభివృద్ధి
కోటనందూరు: స్థానిక తాండవనదిపై తలపెట్టిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో తుపానులు, వరదల సమయాల్లో ప్రజల రాకపోకలకు అవస్థలు తప్పేలా లేవు. మూడేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందు నిలిచిపోయిన పనులు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొనసాగుతాయని భావించిన ప్రజలకు ఆశాభంగం తప్పడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు గడుస్తున్నా పనులు అంగుళం కూడా ముందుకు కదల లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరైన బ్రిడ్జి కాబట్టే ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాండవనది పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షం కురిసినా, తాండవ జలాశయం నుంచి నది ద్వారా సముద్రానికి నీటిని విడిచిపెట్టినా కోటనందూరులో కాజ్‌వే (బ్రిడ్జి)పై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఈ బ్రిడ్జి ఆధారంగా ప్రయాణించే 50 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐదు దశాబ్దాల కలగా మారిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా రూ.10 కోట్లు మంజూరు చేయించారు. మార్చి 2024 వరకూ శరవేగంగా సాగిన పనులకు ఎన్నికల కోడ్‌తో అంతరాయం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేనందున అధికార యంత్రాంగం, పాలకులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
తుని–నర్సీపట్నం రోడ్డు నుంచి కోటనందూరుకు చేరుకోవాలంటే మధ్యలో ఉన్న తాండవనది దాటాల్సి ఉంది. 1976లో నిర్మించిన ఈ కాజ్‌వే పైభాగం శిథిలం కావడం, ఇరువైపులా రక్షణ లేకపోవడం, ఎత్తు, వెడల్పు, కింద పిల్లర్ల మధ్య దూరం తక్కువగా ఉండడం వంటి కారణాలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరదల సమయంలో నదిలో నీరు కాజ్‌వే పైనుంచి ఉధృతంగా ప్రవహించి తుని–నర్సీపట్నం రోడ్డుకు, కోటనందూరు గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో కాజ్‌వేను బ్రిడ్జిగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
తాండవనదిపై శిథిలావస్థకు చేరిన వంతెనతో రాకపోకలకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. తాండవ నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలతో పాటు ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది.
– ఉల్లూరి శ్రీను, కోటనందూరు
అన్ని రకాలుగా అభివృద్ధి
కోటనందూరులో తాండవ నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలతో పాటు ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. కోటనందూరులో తుని–నర్సీపట్నం రోడ్డు నుంచి పాతకొట్టాం, కేఈ చిన్నయ్యపాలెం, రౌతులపూడి, శంఖవరం మీదుగా కత్తిపూడి వద్ద 216 నంబరు హైవేకు చేరుకునేందుకు 33 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంది. తాండవ నదిపై సరైన వంతెన లేక ఈ మార్గంలో భారీ వాహనాలు తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఈ రోడ్డు లూప్‌లైన్‌గానే మిగిలిపోయింది. ఇక్కడ ఉన్న కాజ్‌వే బ్రిడ్జిగా అభివృద్ధి చెందితే సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు రహదారులు, వ్యాపార అవకాశాలు, ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.


