ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

చింతూరు: మండలంలోని చట్టికి చెందిన సోడె రాజకుమార్‌ (30) స్థానిక శబరినది ఒడ్డున వున్న విద్యుత్‌ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శబరినది పరిసరాల్లో గాలించగా అతను విద్యుత్‌ టవర్‌కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు.

ఎస్సీ కాలనీలో చోరీ

15 గ్రాముల బంగారం,

రూ.ఐదు వేల నగదు అపహరణ

తొండంగి: స్థానిక ఎస్సీ కాలనీలో శనివారం చోరీ జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ఎస్సీ కాలనీ శివారులో గాతాడి చిన్నా మేసీ్త్ర పని చేస్తుంటాడు. శనివారం ఇంటికి తాళాలు వేసి భార్య శైలుతో కలిసి కూలీ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలపులు తెరిచి బీరువాల్లో సామాన్లు చిందరవందరగా ఉండటంతో పాటు అందులో దాచుకున్న 15 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.ఐదు వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆభరణాల విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని, బాధితులు పేర్కొన్నారు. ఎస్సై జగన్మోహన్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు అపహరణ

కేసుల నమోదు

ఉప్పలగుప్తం: మండలంలోని వానపల్లిపాలెంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ షేక్‌ జానీబాషా తెలిపిన సమాచారం ప్రకారం వానపల్లిపాలేనికి చెందిన నల్లా రామకృష్ణ ఈ నెల 25న అతని కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం వారి ఇంటి పక్కన ఓ మహిళ తన నివాసంలో పనులు చేసుకుంటూ రామకృష్ణ ఇంటి పైభాగం వైపు చూడగా ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో ఆమె రామకృష్ణ భార్యకు ఫోన్‌ చేసి ఊరి నుంచి వచ్చేశారా అని అడగగా ఆమె లేదని సమాధానం చెప్పింది. దీంతో మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని ఇక్కడి మహిళ చెప్పగా ఆమె ఒకసారి పైకి వెళ్లి చూడమని సూచించింది. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో ఆ మహిళ రామకృష్ణ ఇంటిలోకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టబడి బీరువాతాళాలు సైతం ధ్వంసం చేసి చోరీ జరిగినట్టు గుర్తించారు. వారి సమాచారం మేరకు ఎస్‌ఐ ఎస్‌కే జానీబాషా క్లూస్‌ టీమ్‌ను రప్పించి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 9 గ్రాముల బంగారం, 12 తులాల వెండి, రూ.25 వేలు నగదు చోరీ అయినట్టు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గొర్రెల వ్యాన్‌ బోల్తా

పెరవలి: స్థానిక జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఐషర్‌ వ్యాన్‌ ఖండవల్లి వద్ద అదుపు తప్పి వేగ నియంత్రణకు పెట్టిన డ్రమ్ము, అక్కడే ఉన్న గొయ్యి వల్ల బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న 4 గొర్రెలు మృతి చెందగా, వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

బాలికపై లైంగిక వేధింపులు

దేవరపల్లి: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోని వెళితే.. నల్లజర్ల మండలంలోని ఆ గ్రామంలో 14 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా, కొక్కిరిపాటి కిరణ్‌ ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివగణేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement