పుట్టిన రోజుకని పిలిచి హత్యకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజుకని పిలిచి హత్యకు కుట్ర

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

ఒంటరి మహిళపై

ఇద్దరు యువకుల దాడి

తలపై సుత్తితో కొట్టి

క్వారీలో పడేసిన వైనం

రాత్రంతా మృత్యువుతో పోరాటం

ఫెన్సింగ్‌ వేస్తున్న సిబ్బంది సహకారంతో ప్రభుత్వాస్పత్రికి తరలింపు

కేసు నమోదుకు

మూడు పోలీసు స్టేషన్ల తాత్సారం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): భర్త నిరాదరణకు గురైన ఒంటరి మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె స్థానిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బొమ్మూరు ప్రాంతానికి చెందిన గెడ్డం ధనలక్ష్మికి ఈనెల 25వ తేదీన గాడాలకు చెందిన మట్టాడి ప్రసాద్‌, మట్టాడి అయ్యప్ప ఫోన్‌ చేసి తమ ఇంటిలో పుట్టిన రోజు ఉందని రమ్మని పిలిచారు. పరిచయస్తులే కదా అని వెళ్లిన ఆమెను వారిరువురూ గాడాలలోని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. ఆమె ఆదమరచి ఉన్న సమయంలో వారి వెంట తెచ్చుకున్న సుత్తి తీసి ఆమె తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆమె అపస్మారకస్థితికి చేరడంతో చనిపోయిందని భావించి ఆమెను ఆటోలో రాజమహేంద్రరం త్రీటౌన్‌ పరిధిలోని క్వారీ ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడి గోతుల్లో పడేసి వెళ్లిపోయారు. ఆమె పడిన ప్రాంతంలో మట్టి ఉండడంతో ఉదయం వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. కాగా క్వారీ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ఫెన్సింగ్‌ వేస్తున్న సిబ్బంది ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడి గోతిలోంచి మూలుగులు వినబపడడంతో అటుగా వెళ్లి చూసి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తలపై తగిలిన గాయంతో ఆమె స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. స్ధానికంగా నివాసముంటున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు బర్రే కొండబాబు విషయం తెలుసుకుని ఆమెను కాపాడిన వారి నుంచి సమాచారం సేకరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలనిని సంఘటనపై ఆరా తీశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదుకు బొమ్మూరు, గాడాల, క్వారీ పరిధులను పర్యవేక్షిస్తున్న పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కనీసం జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement