● మానవత్వం చాటిన ముస్లింలు
● కన్నబిడ్డలా సాకిన తల్లికి హైందవ పద్ధతిలో దహన సంస్కారాలు
మంచిర్యాలటౌన్/మంచిర్యాల రూరల్ (హాజీపూర్): మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, రక్త సంబంధం లేకపోయినా ఆప్యాయతలే శాశ్వత బంధాలని మంచిర్యాలలో జరిగిన ఓ ఘటన నిరూపించింది. కన్నకొడుకులా సాకిన ఓ హిందూ వృద్ధురాలికి ముస్లిం యువకుడు కొడుకై తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నాడు. ఆంధ్రపదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన కొప్పర్తి అచ్యుతలక్ష్మి (90) సుమారు 50 ఏళ్ల క్రితం భర్తతో కలిసి వచ్చి మంచిర్యాలలో స్థిరపడ్డారు. స్థానిక ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాల్ సమీపంలో ఎయిర్ కండీషనర్ సేల్స్, సర్వీస్ వ్యాపారాన్ని నడిపేవారు. సంతానం లేకపోవడంతో షాపులో పనిచేసే ముస్లిం యువకుడు మొహమ్మద్ ముజామ్మిల్‌ను సొంత బిడ్డలా చేరదీశారు. 20 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించినా, ముజామ్మిల్‌నే కొడుకుగా భావిస్తూ జీవించారు. అనారోగ్యంతో ఇస్లాంపురలోని నివాసంలో శనివారం అచ్యుతలక్ష్మి కన్నుమూశారు. ఆమె సోదరి హైదరాబాద్ నుంచి వచ్చారు. వ్యాపార సంస్థ వద్ద ఉంచిన ఆమె భౌతికకాయానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్‌గౌడ్, కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, కాంట్రాక్టర్లు షాయక్‌అలీ, ముజాహిద్, మహ్మద్ సాదిక్, స్థానిక వ్యాపారులు, ఏసీ టెక్నిషియన్లు నివాళులర్పించారు. అనంతరం ముస్లింలు పాడె మోయగా, అమ్మగా భావించిన ముజామ్మిల్ కుండ చేతపట్టి జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి, మత సామరస్యాన్ని చాటుకున్నారు.


