ముగ్గురికి స్వల్ప గాయాలు
రాజమహేంద్రవరం రూరల్: స్కూలు బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన లాలాచెరువు–స్వరూప్‌నగర్ రోడ్డులో చోటచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం శ్రీకృష్ణపట్నం నుంచి ఆటోడ్రైవర్ కొల్లి రాజు ఇద్దరు మహిళలను ఎక్కించుకుని రాజమహేంద్రవరం వస్తున్నాడు. ఓ ప్రైవేటు స్కూలు బస్సు లాలాచెరువు నుంచి స్వరూప్‌నగర్ వైపు వెళ్తోంది. రాజు ఆటో ముందున్న కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజుతో పాటు శ్రీకృష్ణపట్నానికి చెందిన సీత, భద్రమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి.
వీరిని చికిత్స నిమిత్తం అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజు పిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


