అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిక్కిరిసిపోయింది. శ్రావణ శుక్రవారం, పౌర్ణమి పర్వదినాలు కలసి రావడం, దీనికి తోడు రత్నగిరి పైన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు సత్యదేవుని సన్నిధికి తరలి రావడంతో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు కిక్కిరిశాయి. భక్తులు వచ్చిన వాహనాలతో పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. సత్యదేవుడిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2,300 జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టుతో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
సాధిక్ ఖాన్ కస్టడీ
పిటిషన్‌పై విచారణ వాయిదా
కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.


