ఫ నలుగురికి గాయాలు
ఫ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం
ఫ అన్నవరం నుంచి పామర్రు వెళుతుండగా ఘటన
దేవరపల్లి: మండలంలోని కృష్ణంపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం కారు బోల్తా పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఓ కుటుంబం బుధవారం రాత్రి ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. అనంతరం, నూతన దంపతులతో కలసి రెండు కార్లలో అన్నవరం సత్యన్నారాయణస్వామి వారి సన్నిధికి వెళ్లారు. స్వామి వారి దర్శనానంతరం వధూవరులు ఓ కారులోను, వరుడి తల్లిదండ్రులు, అక్క, బావ మరో కారులోను పామర్రు బయలుదేరారు. ఈ క్రమంలో వరుడి తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న కారు కృష్ణంపాలెం వద్ద అదుపు తప్పి, డివైడర్‌ను, సోలార్ లైటు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్‌లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


