● నైట్ వాచ్‌మన్లకు
7 నెలలుగా అందని గౌరవ వేతనం
● ఇచ్చేదే అంతంత మాత్రం
● అందులోనూ తీరని జాప్యం
● రూ.2.86 కోట్ల మేర బకాయి
● శానిటరీ వర్కర్లకూ 3 నెలల
వేతనాల పెండింగ్
● ఆకలి కేకలు పెడుతున్న చిరుద్యోగులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆకతాయిలు, దొంగల నుంచి ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు నియమించిన నైట్ వాచ్‌మన్లు జీతం లేని కాపలా కాస్తున్నారు. ఇచ్చేదే అంతంత మాత్రం వేతనం కాగా, దానిని కూడా చంద్రబాబు ప్రభుత్వం 7 నెలలుగా చెల్లించడం లేదు. మరోవైపు కళ్లెం లేని గుర్రంలా నిత్యావసరాల ధరలు దౌడు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పూట గడిచే దారి లేక ఆ కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నాయి.
2023లో నియామకం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మన బడి నాడు–నేడు పథకం కింద కోట్లాది రూపాయలతో వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మునుపెన్నడూ లేని రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు భద్రత కల్పించడం అవసరమని భావించి, రాష్ట్రవ్యాప్తంగా 2023 ఏప్రిల్ 25న 5,378 నైట్ వాచ్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది మే 1న వీరందరూ విధుల్లో చేరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 680 మంది నైట్ వాచ్‌మన్లు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
నైట్ వాచ్‌మన్లకు 2023 మే నుంచి 2025 డిసెంబర్ వరకూ మొత్తం 32 నెలలకు వేతనాలు చెల్లించారు. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. అప్పటి నుంచి జూలై నెల వరకూ నయాపైసా కూడా వీరికి చెల్లించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున 680 మందికి రూ.40.08 లక్షల మేర బకాయి పెట్టింది. ఈవిధంగా ఏడు నెలలకు సుమారు రూ.2.86 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల కూడా పూర్తి కానుంది. దీంతో, మొత్తం 8 నెలల వేతనాలు సుమారు రూ.3.26 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పెట్టినట్లవుతుంది.
సాధారణంగా ఒక నెల వేతనం రాకపోతేనే ఉద్యోగులు ఇబ్బంది పడుతూంటారు. అటువంటిది ఇచ్చే అరకొర వేతనం కూడా ఏడు నెలలుగా ఇవ్వకపోతే తాము కుటుంబాలను ఏవిధంగా పోషించుకోవాలని నైట్ వాచ్‌మన్లు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలకు వస్తున్న అధికారులను తమ వేతనాలు ఎప్పుడు విడుదలవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. నెలంతా పాఠశాలను కంటికి రెప్పలా కాపాడుతున్న తమకు ఇవ్వాల్సిన రూ.6 వేలు సైతం నెలనెలా ఇవ్వకుంటే తమ పరిస్థితేం కావాలని అంటున్నారు. ఎన్నికలకు ముందు తమ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోకపోగా, ఇవ్వాల్సిన వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని వాపోతున్నారు. నెలల తరబడి పెండింగ్ పెడితే తాము ఏం తిని బతకాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వేతనాల కోసం ఇటీవల సీఐటీయూ ఆధ్వర్యాన నైట్ వాచ్‌మెన్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అలాగే రాష్ట్ర ఉన్నతాధికారులకు నైట్ వాచ్‌మెన్ యూనియన్ తరఫున వినతులు ఇచ్చినా వేతనాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో, అప్పులు చేసి, కుటుంబాలను పోషించుకోవలసి వస్తోందని నైట్ వాచ్‌మన్‌లో వాపోతున్నారు.
పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం
ఇచ్చే అరకొర వేతనాన్ని కూడా ప్రతి నెలా విడుదల చేయడం లేదు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయి? ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిరుద్యోగులపై ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం దుర్మార్గం. వెంటనే వారి గౌరవ వేతనాలు విడుదల చేయాలి. ఇప్పటికే పీజీఆర్‌ఎస్‌లో ఐదారుసార్లు ఫిర్యాదు చేశాం. దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉంది ప్రభుత్వం తీరు.
– నూకల బలరామ్,
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా


