దేవరపల్లి: స్థానిక పంచాయతీ కార్యాలయంలో గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై కొవ్వూరు డివిజినల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) ఐవీ రాఘవులు గురువారం విచారణ నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఉత్తర్వులతో ఆయన ఈ విచారణ జరిపారు. 2013–18 మధ్య పంచాయతీ నిధులు దుర్వినియోగమైనట్లు ఏలూరుకు చెందిన గోరెల్ల నారాయణరాజు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించి, సంబంధిత వ్యక్తులను విచారించి, అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ డీపీఓను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాఘవులు ఈ విచారణ నిర్వహించారు. విచారణకు హాజరు కావాలంటూ ఎనిమిది మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, 2013–18 మధ్య రూ.7 కోట్ల పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేనందున సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నారాయణరాజు హైకోర్టులో ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో చేపట్టిన ఈ విచారణకు హాజరైన వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుని, కలెక్టర్, డీపీఓలకు నివేదిక అందజేస్తానని చెప్పారు.
పుష్కరాల పనులు
వేగవంతం చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు సుమారు 10 నెలలు మాత్రమే సమయమున్నందున సంబంధిత పనులు వేగవంతం చేయాలని రాజమండ్రి ఎంపీ, దిశ కమిటీ చైర్‌పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పుష్కరాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పుష్కరాల నాటికి పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై సమీక్షించేందుకు దిశ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తుల సీఈఓలు వీవీవీఎస్ లక్ష్మణరావు, పి.జగదంబ, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధికి భక్తుల తాకిడి
పిఠాపురం: దత్తాత్రేయుని అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభస్వామి జన్మస్థలం కావడంతో పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికొచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కట్టడం ఆనవాయితీగా ఉంది. శుక్రవారం రాఖీ పౌర్ణమి అయినప్పటికీ గురువారం నుంచే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. ఈ ఏడాది సుమారు 30 వేల మంది మహారాష్ట్రీయులు తరలిరావడం విశేషం. పిఠాపురంలో పేరొందిన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శుక్రవారం నిర్వహించే రాఖీ పౌర్ణమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు. గోపూజలు, దత్త హోమాలు, పల్లకీ సేవలు వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం నాటికి మరింత మంది వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. పాదగయ క్షేత్రంలో వెలసిన దత్తాత్రేయ స్వామి వారికి కూడా గురువారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.


