4 పరిషత్‌లుగా ఉమ్మడి తూర్పు! | - | Sakshi
Sakshi News home page

4 పరిషత్‌లుగా ఉమ్మడి తూర్పు!

Aug 28 2026 12:15 AM | Updated on Aug 28 2026 12:15 AM

ఉమ్మడి జెడ్పీ ఆఖరి ‘భేటీ’ నేడే

కాకినాడలోని జెడ్పీ కార్యాలయం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఆఖరి సమావేశం చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం నాలుగేళ్లుగా జెడ్పీ ఉమ్మడిగానే కొనసాగింది. ప్రస్తుత పాలక మండలి గడువు సెప్టెంబర్‌ 10తో ముగుస్తుంది. అక్టోబర్‌లో జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ ప్రతిపాదించడం, అంతకు ముందే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉండటంతో ఈ జెడ్పీని నాలుగు భాగాలుగా విభజించనున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ప్రధాన కేంద్రాలుగా ఈ జిల్లా పరిషత్‌ విడిపోనుంది.

చరిత్రలో విశిష్ట స్థానం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. అప్పట్లో జిల్లా బోర్డు చైర్మన్‌గా మల్లిపూడి పళ్లంరాజు సుదీర్ఘ కాలం పని చేశారు. మరోవైపు స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నారు. ఈ జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన ఎస్‌బీవీకే సత్యనారాయణరావు కేంద్ర మంత్రి అయ్యారు. జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఎదిగారు. వంగా గీత జెడ్పీ కూడా చైర్‌పర్సన్‌గా పనిచేసి రాజ్యసభలో ప్రవేశించారు. బొడ్డు భాస్కర రామారావు రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర స్థాయి పదవులు సైతం అలంకరించారు. చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ జెడ్పీ చైర్మన్‌గా పని చేసి, అనంతరం వైఎస్సార్‌ సీపీ హయాంలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు.

జిల్లా బోర్డు నుంచి జెడ్పీగా మార్పు

స్వాతంత్య్రం తరువాత దేశంలో స్థానిక స్వపరిపాలనకు కొత్త రూపం ఇవ్వాలనే ఆలోచన బలపడింది. 1959లో జిల్లా పరిషత్‌ చట్టం రావడంతో దాని ఆధారంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ జెడ్పీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1959 డిసెంబరు ఒకటో తేదీ నుంచి జిల్లా పరిషత్తులు ఏర్పాటయ్యాయి. దీంతో పాత జిల్లా బోర్డు వ్యవస్థకు బదులు మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పునాది పడింది. గ్రామ, సమితి, జిల్లా పరిషత్‌ స్థాయిలుగా ఏర్పడిన ఈ వ్యవస్థ అనంతర కాలంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లుగా రూపాంతరం చెందింది. తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఆవిర్భావం 1959లోనే జరిగింది. 2022 ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. అంతకు ఆరు నెలల ముందే జెడ్పీ ఎన్నికలు జరగడంతో పదవీ కాలం ముగిసేంత వరకూ విభజనకు ఆగాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement