ద్వారకా తిరుమల: చినవెంకన్నకు ఓ భక్తుడి కుటుంబం సమర్పించిన రూ.92 లక్షల విలువైన స్వర్ణ, వెండి కవచాలకు గురువారం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు ఈ కవచాలను ఆలయ చైర్మన్ ఎస్‌వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్‌లకు బుధవారం అందించిన విషయం తెలిసిందే. కవచాలున్న పళ్లేన్ని దాత సాంబశివరావు శిరస్సుపై పెట్టుకుని గురువారం ఉదయం ఆలయంలో అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ ప్రదక్షిణలు చేశారు. అనంతరం, ఆ కవచాలకు అర్చకులు పుణ్యాహవాచనం, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలను ఆగమ శాస్త్రానుసారం నిర్వహించి, స్వామివారికి అలంకరించారు. దాత దంపతులకు ఆలయ డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావులు స్వామి, అమ్మవార్ల చిత్రపటం అందించారు.


