● పేదల పాకలు పీకేసిన వైనం
● ‘కూటమి’ దుశ్చర్యేనని
వైఎస్సార్ సీపీ ఆరోపణ
● పేదలకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ త్రిమూర్తులు అరెస్ట్
● మండపేటలో పెద్ద కాలువ
గట్టు వద్ద అలజడి
కపిలేశ్వరపురం (మండపేట): గాఢ చీకటి.. చడీచప్పుడు లేని వేళ.. అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో.. ఒక్కసారిగా బూట్ల శబ్దాలతో పోలీసుల అలజడి.. ఆదివారం తెల్లవారు జామున సరిగ్గా మూడు గంటలకు మండపేట పెద్ద కాలువ గట్టు వద్ద నిరుపేద కూలీల నివాస ప్రాంతాల వద్ద హడావుడి ఇది. పగలంతా కూలి పనులు చేసుకుని గాఢ నిద్రలో ఉన్న కూలీలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి బిత్తరపోయారు. మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆదేశాలపై తరలివచ్చిన పెద్ద సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఒక్కసారిగా పేదల పాకలు పీకేందుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పట్టణంలోని వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పేదలకు అండగా నిలిచారు. సుమారు రెండు గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రోద్భలంతోనే మున్సిపల్, పోలీస్ అధికారులు ఎమ్మెల్సీ తోటపై దౌర్జన్యం చేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. పేదల తరఫున ఎమ్మెల్సీ త్రిమూర్తులు మాట్లాడుతుండగా డీఎస్పీ దేవకుమార్, పట్టణ సీఐ డి.సురేష్, సిబ్బంది బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వ్యాన్‌లో ఎక్కించారు. అదే వ్యాన్‌లో స్వగ్రామం వెంకటాయపాలెం తరలించి, గృహ నిర్బంధం చేశారు. ఒకపక్క పేదల నివాసాలు తొలగింపు, మరోపక్క వారికి అండగా నిలిచినవారి అక్రమ నిర్భంధంతో మండపేట పెద్దకాలువ గట్టు ప్రాంతం అట్టుడికింది. చివరికి అక్కడి 16 ఇళ్లు తొలగించారు. 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో మొత్తం160 మంది కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
పెద్దలకు దాసోహం.. పేదలపై ప్రతాపం
మండపేట పట్టణంలో విలువైన మున్సిపల్ స్థలాలు అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల ఆక్రమణలో ఉన్నాయి. వాటి వివరాలతో సహా కమిషనర్‌కు ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. ఆక్రమణలో ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఎమ్మెల్సీ తోట సర్వే చేయించి మున్సిపాలిటీకి అప్పగించేందుకు కృషి చేశారు. అదే స్థలాన్ని మరోసారి ఆక్రమించుకున్నారు. దానిపై కమిషనర్ వైఖరిని కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఎండగట్టారు.
ప్రభుత్వం కూలిపోక తప్పదు
పేదల ఇళ్లు కూల్చివేత ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయన స్వగృహం వెంకటాయపాలెంలో స్పందించారు. ఇళ్ల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రోద్భలం ఉందన్నారు. పేదల బతుకులను రోడ్డున పడ్డేసిన కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారు. సుమారు 60 ఏళ్లకు పైబడి నివాసముంటున్న నిరు పేదలను ఖాళీ చేయించడం న్యాయమా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు సమీపంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రమేయం ఉన్న పదెకరాల భూమి ఉందని, ఆ భూమి విలువను పెంచుకునే కుట్రలో భాగంగానే ఇళ్లు తొలగించారని ఆరోపించారు. వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా రోడ్డున పడేశారన్నారు. హిందూ శ్మశాన వాటిక స్ధలాన్ని ఆక్రమించినా, చర్యలు లేవన్నారు. కమ్మ మహాజన సంఘం ఎదురుగా మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయించడం లేదన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి ఎమ్మెల్యే వేగుళ్ల తన లేఅవుట్లలో కలిపేసుకున్నారన్నారు. బురుగుంట చెరువు వద్ద ప్రెస్‌క్లబ్‌కు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందన్నారు. పట్టణంలో బడాబాబులు చేసిన ఆక్రమణలను కాదని నిరుపేదల ఇళ్లను తొలగించడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం వచ్చినప్పుడు పేదలకు న్యాయం చేస్తామని, దుశ్చర్యపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పుష్కరాల పేరు చెప్పి..!
మండపేట పెద్ద కాలువ గట్టు వద్ద సుమారు 60 ఏళ్లకు పైగా నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా పట్టణంలోని హోటళ్లు, ఇతర వ్యాపార దుకాణాల్లో పనులు చేసుకుంటున్నారు. వారి ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రోద్భలంతో పలుమార్లు ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయించే ప్రయత్నం బెడిసికొట్టడంతో, తర్వాత మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయిస్తే ప్రతిఘటిస్తామంటూ ఎమ్మెల్సీ త్రిమూర్తులు అండగా నిలిచారు. చివరకు పుష్కర నిధులతో కాలువ రేవు వెంబడి అభివృద్ధి చేసేందుకు అంటూ అధికారులు ఖాళీ చేయించారు. పుష్కరాల్లో గోదావరి నదీ స్నానానికి ప్రాధాన్యం ఇస్తారని, పేదలను కష్టపెట్టొద్దన్న ఎమ్మెల్సీ విజ్ఞప్తిని విస్మరించారు.
కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా..
కూలి పనులు చేసుకుని జీవించే తమను రోడ్డున పడేయవద్దంటూ బాధితులు కమిషనర్ రంగారావు కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. అయినా పాకల తొలగింపులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తోట ఘటనా స్థలానికి రాగానే, పేదలు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. రాత్రివేళ పేదలకు అన్యాయం చేయడం సరికాదంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, ఆయన్ని పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. అడ్డుకున్న పార్టీ కార్యకర్తలను పోలీసు వ్యాన్ ఎక్కించారు. పగలు కాకుండా రాత్రిపూట పేదల ఇళ్లు తొలగించడాన్ని న్యాయమనుకుంటున్నారా అంటూ పట్టణ ప్రజలు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. పేదల ఇళ్లను తొలగించడాన్ని కూటమి నేతలు విజయంగా భావిస్తున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రతి చర్య వెనుకా కూటమి నేతల ప్రోద్భలం ఉన్నట్టు తెలుస్తుందన్నారు.


