దేవరపల్లి: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది దేవరపల్లిలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావును ఆదివారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. తలారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు మేకా శేషుబాబు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎంపీపీ కేవీకే దుర్గారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి పచ్చా రాంగోపాల్, కారుమంచి రమేష్ తదితరులు సుబ్బారెడ్డి వెంట ఉన్నారు.
కిటకిటలాడిన
చినవెంకన్న క్షేత్రం
ద్వారకాతిరుమల: స్థానిక చిన వెంకన్న సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో పాటు శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, పెళ్లి బృందాలు క్షేత్రానికి తరలివచ్చాయి. దర్శనం క్యూ లైన్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మరోవైపు శ్రీవారి సన్నిధిలో ఆదివారం ఉదయం కూడా పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. నూతన వధూవరులు, వారి బంధుమిత్రులతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. ఆలయ అనివెట్టి మండపంలో పలు భజన మండళ్ల సభ్యులు నిర్వహించిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.
సమస్యను
పరిష్కరించండి
రాజమహేంద్రవరం రూరల్: టెట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని, ఈ సమస్యను రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పరిష్కరించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ సత్యనారాయణరెడ్డి, అన్ను వెంకటరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. టెట్ అర్హత మార్కులను తగ్గించడంతో పాటు, ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టులో మాత్రమే పరీక్ష రాసే విధంగా సిలబస్‌ను మార్చాలన్నారు. ఆఫ్ లైన్ విధానంలో పరీక్ష జరపాలన్నారు. 50 ఏళ్ల నుంచి వయసు పైబడిన ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావడానికి గ్రేస్ మార్కులు కేటాయించాలన్నారు. ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ వేసి, ఐఆర్ ప్రకటించాలన్నారు.
రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర ఉన్నవారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వారికి పలు సూచనలు చేశారు. నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని, చెడు వ్యసనాలను మాని, మంచి నడవడికను అలవర్చుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్‌ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని అన్నారు. ఎటువంటి గొడవలు, నేరాలలో పాల్గొన్నా వెంటనే చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు.


