షెడ్యూల్‌ ప్రకారమే నర్సరీ అసోసియేషన్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ ప్రకారమే నర్సరీ అసోసియేషన్‌ ఎన్నికలు

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

అపోహలు నమ్మవద్దని కమిటీ వెల్లడి

కడియం: నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల నిర్వహణ, పెద్దల కమిటీ వెల్లడించింది. ఆదివారం కడియపులంకలోని అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు వివరాలను తెలిపారు. సోషల్‌ మీడియా ప్రచారాలను నమ్మవద్దని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

నామినేషన్ల ఉప సంహరణ అనంతరం రత్నం అయ్యప్ప, బొర్సు సుబ్బారాయుడులు అధ్యక్షులుగా, 3వ వార్డు నుంచి ఆకుల కిశోర్‌, దూలం సత్యనారాయణ, 7వ వార్డు నుంచి పుల్లా శ్రీను, మండెల కృష్ణలు పోటీలో ఉన్నారన్నారు. ఈ మేరకు వారికి గుర్తులు కేటాయించి, ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కడియపులంకలోని అసోసియేషన్‌ కార్యాలయ ఆవరణలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ మేరకు మండలంలో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సేవలను కూడా కోరామని కమిటీ తెలిపింది. సంఘంలోని ప్రతి సభ్యుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు ప్రచారం చేయాలన్నారు. ఇదిలా ఉండగా రాజకీయాలకు అతీతంగా అసోసియేషన్‌ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ముందు పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య రాజీ ప్రయత్నాలు జరగడాన్ని పలువురు విలేకరులు కమిటీ ముందుకు తీసుకువచ్చారు. ఎన్నికల కమిటీలోనే కొందరు ఇందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై కమిటీ తీసుకునే క్రమశిక్షణ చర్యలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై కమిటీ సభ్యులు సమాధానం చెబుతూ చిన్న లోటుపాట్లు ఉన్నమాట వాస్తమేనని, అయితే అసోసియేషన్‌లోని సభ్యుల ఐకమత్యం కాపాడడం, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం తమ విధులని, మీడియా తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదని, వీటిని రద్దు చేసి మరోసారి జాగ్రత్తలతో నిర్వహించాలని పలువురు రైతులు లిఖిత పూర్వకంగా విజ్ఞాపనాపత్రాన్ని కమిటీకి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement