● మార్ట్ నిర్వహణపై డ్వాక్రా సీసీ ఫిర్యాదు
● మహిళా నేత ఖాతాకు సమాఖ్య నిధులు
● సభ్యుల వివరణ తీసుకున్న మంత్రి దుర్గేష్
● కలకలం రేపుతున్న ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
నిడదవోలు రూరల్: నిడదవోలు వెలుగు మాహిళా మార్ట్ వేదికగా సాగిన అక్రమాలలో తవ్వేకొద్ది విస్తుపోయే నిజాలను తెలుస్తున్నాయి. మార్ట్ మూత, కూటమి మహిళా నేత పెత్తనం, నిబంధనల ఉల్లంఘనలపై ‘సాక్షి’లో ఈనెల 19న ‘ప్రగతి వెలుగుకు పోస్టు మార్ట్‌మ్’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. డీఆర్‌డీఏ ఉన్నతాధికారుల విచారణ మేరకు నిర్వహిస్తున్న ప్రాథమిక తనిఖీల్లో ఎన్నో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి.
నిధులకు రెక్కలు..
పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మండల సమాఖ్య పరిధిలో 2022 నవంబర్ 10న‘చేయూత మహిళా మార్ట్’ ప్రారంభించారు. 1700 గ్రూపుల పరిధిలోని ఒక్కొక్క సభ్యురాలి నుంచి రూ.220 చొప్పున రూ.38.35 లక్షల పెట్టుబతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దీనిని ఏర్పాటుచేశారు. జిల్లాలో ఐసీడీఎస్ చేపట్టి ‘బంగారు కొండ’ కార్యక్రమానికి అవసరమైన సరకుల సరఫరా బాధ్యతను 2023లో అప్పటి కలెక్టర్ ఈ మార్ట్‌కు అప్పగించారు. వారు సరఫరా చేసిన కిట్లు విక్రయించగా వచ్చిన రూ.13,86,775కు 2025 ఏప్రిల్ 22న కలెక్టర్ చెక్కు అందజేశారు. ఈ నిధులను ఏ రసీదులతో విత్‌డ్రా చేశారో తెలియకుండా రికార్డులు మాయం చేసినట్టు తెలుస్తోంది.
గతంలోనూ ఇదే తరహా దోపిడీ
సదరు మహిళా నేత 2017లోనూ మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేసి అప్పటి టీడీపీ నేతల సహకారంతో అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఆమె పర్యవేక్షణలో అన్నా సంజీవని జనరిక్ మందుల దుకాణంతో పాటు తిమ్మరాజుపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. రైస్ మిల్లర్లతో కలిసి అధికారులతో సిండికేట్‌గా ఏర్పడి రైతుల ధాన్యం విక్రయాల్లో పలు మోసాలకు పాల్పడ్డారు. 2018లో తిమ్మరాజుపాలెం ఆదర్శ గ్రామ సంఘం నుంచి ఆ మహిళా నేత సమక్షంలో కొందరు సభ్యులు రూ.3.8 లక్షల రుణం తీసుకోవడంతో దానికి వడ్డీ, మిగిలిన అడ్వాన్సులు కలిపి 2022లో రూ.5,61,742 చెల్లించాలని అప్పటి అధికారులు ఆమెను ప్రశ్నించారు. దీంతో త్వరలోనే చెల్లిస్తానని ఖాళీ చెక్కులతో పాటు ఆ మహిళా నేత రూ.2 లక్షలకు సంబంధించిన ప్రామిసరీ నోటును అప్పటి అధికారులకు అందజేసింది. ఈలోగా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నిధుల రికవరీని అధికారులు విస్మరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.3 కోట్ల టర్నోవర్‌తో లాభాల్లో నడిచిన మార్ట్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దోచుకున్నారని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’ పత్రిక ద్వారానే ఈ బాగోతం బయటపడిందని, వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన బాధ్యురాలిపైనా, సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, దారి మళ్లిన ప్రతి పైసా రికవరీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండల సమాఖ్య అధ్యక్షురాలితో పాటు సభ్యులను శనివారం తన కార్యాలయానికి పిలిచి వివరణ తీసుకున్నారు.
కూటమి మహిళా నేత ఖాతాలోకి నిధులు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్‌లో సదరు మహిళా నేత మండల సమాఖ్య అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి మార్ట్ వ్యవహరాల్లోకి ప్రవేశించింది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.7,76,830 మార్ట్ లావాదేవీల సొమ్మును అధికారిక ఖాతాలో కాకుండా తన వ్యక్తిగత ఖాతాలకు చేసినట్టు కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ) ఏడాది జూన్ 2వ తేదీన డీఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్ట్ నిర్వహణ సక్రమంగానే జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అవకతవకలు చోటు చేసుకున్నట్టు డీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు సీసీ ఆరు పేజీల లేఖలో ఫిర్యాదు చేసి విచారణ కోరారు.


