వేడుక వేళ తీయని తిప్పలు! | - | Sakshi
Sakshi News home page

వేడుక వేళ తీయని తిప్పలు!

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

శ్రావణంలో బెల్లం, పంచదారకు రెక్కలు

సామాన్యులకు తప్పని ధరాఘాతాలు

ద్వారకాతిరుమల: శ్రావణం అంటేనే శుభకార్యాల కాలం. శుభకార్యమంటే షడ్రసోపేతమైన వంటకాలు.. వాటిలో మధుర పదార్థాలు తప్పనిసరి. చక్కెరపొంగలి, పాయసం, బూరెలు వగైరా వంటకాలకు పంచదార, బెల్లం వినియోగం తప్పనిసరి. వీటి ధరలు సగటు జీవి తట్టుకోలేనంగా ఉండడంతో ఇంటిల్లిపాదికీ పండగ మాధుర్యాన్ని పంచడానికి సతమతమవుతున్నాడు. జులై నెలాఖరు నాటికి కిలో పంచదార సుమారు రూ.45 ఉండగా, ప్రస్తుతం రూ.75కు చేరింది. ఆగస్టు ప్రారంభం నుంచే పంచదార ధరలు పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి క్రమంగా పెరుగుతూ 22 రోజుల్లో కిలో రూ.30కి చేరింది. మరోవైపు బెల్లం సైతం అదే స్థాయిలో పంచదారకు సమానంగా చేరడంతో సామాన్యులకు ఇబ్బంది తప్పడం లేదు.

పంచదారతో పోటీగా బెల్లం..

మార్కెట్‌లో బెల్లం సైతం పంచదారతో పోటీ పడుతూ రూ.70 నుంచి రూ.75 వరకు చేరింది. ఆర్గానిక్‌, ప్యూర్‌ చెరకు, ప్రముఖ బ్రాండ్ల బెల్లం ధరలు రూ.100 పైమాటే ఉంది.

వ్యాపారులు లబోదిబో..

సామాన్యుల మాట పక్కన పెడితే టీ స్టాల్స్‌ మొదలుకొని హొటళ్లు, బ్యాకరీలు, స్వీట్‌ స్టాల్స్‌, క్యాటరింగ్‌ వ్యాపారులు, శీతల పానీయాల వ్యాపారులు ధరల దాడిని తట్టుకోలేకపోతున్నారు. ఒకవైపు పంచదార, బెల్లం ధరలు భగ్గుమనడం, మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడంతో స్వీట్ల తయారీ వ్యయం అమాంతం పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో డిమాండ్‌ తగ్గి వ్యాపారులు నష్టపోతున్నారు.

దడపుట్టిస్తున్న ధరలు..

మూడు నెలల వ్యవధిలో రిటైల్‌ మార్కెట్‌లో ధనియాలు కిలో రూ.90 నుంచి రూ.210కి చేరింది. రెండు నెలల క్రితం కిలో రూ.160 ఉన్న రిఫైన్డ్‌ ఆయిల్‌ ధర ప్రస్తుతం రూ.190కి పెరిగింది. నెల రోజుల వ్యవధిలో సోనామసూరీ బియ్యం కిలో రూ.50 నుంచి రూ.75కి, పీఎల్‌ రకం బియ్యం రూ.35 నుంచి రూ.55కి పెరిగింది. వారం క్రితం వరకు కిలో రూ.30 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.60కి చేరుకున్నాయి.

ఆగస్టులో పంచదార ధర పెరుగుదల..

తేదీ హోల్‌సేల్‌ రిటైల్‌

(రూపాయలలో)

01 45 50

04 50 55

10 56 60

17 60 65

19 63 68

22 70 75

ధర పెంచలేం.. నష్టాలు భరించలేం!

పండుగ సీజన్‌ ప్రారంభంతోనే పంచదార ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముడి సరుకుల ధరలు సైతం పెరిగి స్వీట్ల తయారీ వ్యయం పెరిగిపోయింది. ధరలు పెంచలేము.. నష్టానికి అమ్మలేము.

కొత్తపల్లి దొరబాబు,

స్వీట్‌ షాపు నిర్వహకుడు, ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement