మద్యం దుకాణం ఎక్సైజ్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణం ఎక్సైజ్‌ దాడి

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

58 యానాం మద్యం సీసాల స్వాధీనం

ముగ్గురు నిందితుల అరెస్టు

అయినవిల్లి: అయినవిల్లి మండలంలోని మాగం శ్రీరత్న వైన్స్‌ షాపును ఎక్సెజ్‌ అధికారులు ఆదివారం సీజ్‌ చేశారు. మండలం మాగంలోని ఈ దుకాణంలో యానాం మద్యాన్ని భారీ స్థాయిలో తెచ్చి విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. వారు తెచ్చిన మద్యాన్ని బ్రాండెడ్‌ సీసాలలో నింపి విక్రయిస్తున్నట్టు తెలిసిందని సీఐ రవితేజా తెలిపారు. ఈ మేరకు 58 యానాం మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

అన్నవరం: స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.శ్యామ్‌ త్రినాథ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాం నిరీక్షిస్తున్‌ వ్యక్తి విశాఖ నుంచి వస్తున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను గమనిస్తూ రైలు దగ్గరకు రాగానే ఇంజిన్‌ ముందుకు దూకాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి 40 ఏళ్లు ఉంటాయని, తెలుపు రంగు గడుల చొక్కా, పింక్‌ రంగు ప్యాంటు ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ లో భద్రపరచినట్టు తెలిపారు. వ్యక్తి వివరాలు తెలిసిన వారు 92475 86731 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆయన కోరారు.

కౌన్సెలింగ్‌తో

బాల్య వివాహం రద్దు

కె.గంగవరం: మండలంలోని బాలాంతరం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు జరుగనున్న వివాహాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 సిబ్బంది ఆదివారం అడ్డుకున్నారు. ఆమెకు కాజులూరు మండలం ఐతపూడికి చెందిన వరుసకు మేనమామ అయ్యే 36 ఏళ్ల వ్యక్తితో ద్రాక్షారామలో ఈ నెల 26న వివాహం జరగనున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు బాలిక ఇంటికి చేరుకుని ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీనితో వారు ఆ వివాహాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ మానస, జి.సూర్యనారాయణమూర్తి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎం.పార్వతి పాల్గొన్నారు.

కారు డ్రైవర్‌పై కేసు నమోదు

ఆత్రేయపురం: కారును అతివేగంగా నడిపి మరో కారును ఢీ కొట్టిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌.రాము తెలిపారు. వివరాల్లోకి వెళితే వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకుని టాటా జస్ట్‌ కారుపై తిరిగి వెళ్తున్న బైన గూడేనికి చెందిన కారంగి శ్రీనివాసరావు కారును లొల్ల లాకుల సమీపంలో ఎర్టిగా కారు ఢీకొంది. దీంతో కారంగి శ్రీనివాసరావు, సునీత దంపతులు, వారి ఇద్దరు కుమారులు సాయిరాంకు మెడపై తీవ్ర గాయం, చందుకు గాయాలయ్యాయి. వీరు 108 వాహనంపై రాజమహేంద్రవరం రాజు న్యూరో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బాధితుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్‌.రాము తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

గండేపల్లి: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్కానింగ్‌కు తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు మండలంలోని మురారికి చెందిన శీలం భద్రరావు (75) మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా విశాఖ వైపు నుంచి వస్తున్న మరో మోటార్‌ సైకిల్‌ డీకొంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు స్కానింగ్‌కు తీసుకువెళుతుండగానే అతడు మృతి చెందినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement