● సీహెచ్‌సీకి వెళ్లాలంటే ఎన్నో తిప్పలు
● డివైడర్ దాటడానికి రోగుల ప్రయాస
గండేపల్లి: నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటని సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)ను ఇటీవల జెడ్ రాగంపేటని నూతన భవనానికి మార్చారు. అక్కడి వసతులు పెంచడంతో కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ప్రాంతాల రోగులు అక్కడికే క్యూ కడుతున్నారు. అయితే ఆస్పత్రి సమీపంలో డివైడర్ కటింగ్ లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో గ్రిల్ దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో పలు సందర్భాలలో రోగులు వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే వాహనాలపై వచ్చే వారైతే నీలాద్రిరావు పేట వద్ద ఉన్న ఆదిత్య ఆస్పత్రి వరకూ వెళ్లి యూ టర్న్ తీసుకు రావలసి వస్తోంది. ఈ పరిస్థితి అత్యవసర వైద్యం అందాల్సిన రోగులకు ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి ఆస్పత్రి ఎదుట డివైడర్ వద్ద యూ టర్న్ ఏర్పాటు చేస్తే రోగులతో పాటు, అంబులెన్స్‌ల రాకపోకలకు అనువుగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.


