కాకినాడ రూరల్/సఖినేటిపల్లి: ఎదిగొచ్చిన కుమారుడు తమకు అండగా ఉంటాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులను విధి చిన్న చూపు చూసింది. డ్రైవర్‌గా పనిచేస్తూ చేదోడుగా ఉన్న అతడిని వారికి దూరం చేసింది. అయితే కుమారుడి అవయవాలను దానం చేసి, పుత్ర శోకంలోనూ ఆ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ముత్యాల తేజా దుర్గ హనుమంత్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. బిడ్డను కోల్పోయిన విషాదంలో ఉన్న తల్లిదండ్రులు వరలక్ష్మి, నాగేశ్వరరావు, మేనమామ రావి ఆంజనేయులు, అక్కా బావ చల్లా శిరీష, పవన్‌లు హనుమంత్ అవయవదానానికి ముందుకు వచ్చి సమ్మతించారు. ఈ మేరకు సర్పవరం జంక్షన్‌లోని కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున హనుమంత్ అవయవాలను సేకరించారు. ఒక కిడ్నీని కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో అవసరమైన రోగికి విజయవంతంగా మార్పిడి చేశారు. మరో కిడ్నీని అవయవ కేటాయింపు ప్రక్రియ ప్రకారం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ట్రస్ట్‌లో నిర్వహించిన క్యాడావర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్రమంలో సర్జన్ డాక్టర్ గణేష్ ఆదిమూలం, వైద్యులు సనా ప్రవీణ్, కిశోర్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, ఎస్‌పీహెచ్‌ఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగినట్టు కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రి సీఓఓ డాక్టరు రవి సంతోష్ తెలిపారు.
గేదె అడ్డురావడంతో ప్రమాదం
సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరకు చెందిన ముత్యాల తేజ దుర్గా హనుమంతు ఈ నెల 17వ తేదీ రాత్రి అంతర్వేది దేవస్థానం నుంచి ఇంటికి బైక్‌పై వస్తున్నాడు. మార్గం మధ్యలో గేదె అడ్డు రావడంతో దాన్ని ఢీకొని పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు తొలుత మలికిపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అటుపై మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతరం ట్రస్టు ఆసుపత్రికి తరలించారు. అక్కడ గత రాత్రి హనుమంతు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో హనుమంతు అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు.
ఆదర్శంగా నిలిచిన తల్లిదండ్రులు
రోడ్డు ప్రమాదంలో కుమారుడు బ్రెయిన్ డెడ్
అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు
కిమ్స్ ట్రస్ట్ హాస్పటల్‌లో
విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్


