● రోడ్డు ప్రమాదం మృతులు సోమేశ్వరం యువకులు
● గ్రామంలో విషాద ఛాయలు
రాయవరం/చింతూరు: జాతీయ రహదారి 30పై శుక్రవారం రాత్రి చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద జరిగిన కారు దహనం ఘటనలో మృతులు తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో అవిడి సూర్య వినయ తేజ (28) కారులోనే సజీవ దహనం కాగా, నిమ్మకాయల అయ్యన్న అలియాస్ హరి (35) తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. వీరిద్దరూ జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వివాహితుడైన హరి స్వీట్ స్టాల్ నిర్వహించుకుంటుండగా, తేజ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భద్రాచలంలో శనివారం జరిగే స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వీరిద్దరూ కారులో బయలుదేరారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కుంటలోని స్నేహితుడి ఇంటికి వెళుతుండగా చింతూరు – భద్రాచలం మధ్యలో బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరి కారును ఒడిశా నుంచి చైన్నె వెళుతున్న ఐరన్ లోడ్ లారీ ఢీకొని, సుమారు వంద మీటర్ల మేర లాక్కెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ సీటులో ఉన్న హరిని బయటకు లాగారు. అపస్మాకరక స్థితికి చేరుకున్న తేజను బయటకు లాగే ప్రయత్నం చేస్తుండగానే కారు కింద నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించారు. దీంతో తేజ కారులోనే సజీవ దహనమవ్వగా, హరి ఆస్పత్రిలో మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలకు శనివారం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
విషాద ఛాయలు
సోమేశ్వరం గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోనే హరి, తేజ కుటుంబాలు నివసిస్తున్నాయి. హరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, భార్య ప్రసన్న, బాబు, పాప ఉన్నారు. గ్రామంలో తల్లి లక్ష్మి, తండ్రి శ్రీను ఉంటున్నారు. ఇదిలా ఉంటే తేజ అవివాహితుడు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలు గ్రామానికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


