గంజాయి గుప్పుమంటోంది.. ఊరూవాడా ఎక్కడైనా దొరుకుతోంది.. ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తూ ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.. ఈ ఘటనల్లో పోలీసులకు గంజాయి దొరికేది కొంతయితే, తరలిపోతున్నది లెక్క లేనంతగా ఉంది.
ఇంత జరుగుతున్నా, గంజాయి మత్తును వదిలించామని కూటమి పెద్దలు చెబుతుండడం హాస్యాస్పదం అవుతోంది. చాలాచోట్ల మత్తులో ఆకతాయిలు, రౌడీమూకలు
పేట్రేగిపోతుండడం గమనార్హం.
సాక్షి, రాజమహేంద్రవరం: చారిత్రక రాజమహేంద్రవరంతో పాటు తూర్పుగోదావరి జిల్లా గంజాయి మత్తులో ఊగుతోంది. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. సమీపంలోని ఏజెన్సీతో పాటు ఒడిశా నుంచి కొనుగోలు చేసిన సరకు నగరం మీదుగానే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలకు తరలిపోతోంది. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో పట్టుబడడం తప్పితే, ఎక్కువ సరకు గుట్టుగా వెళ్లిపోతోంది. అదే సమయంలో జిల్లాలోనూ ఆ సరకు దిగుమతి చేసుకుని చిన్న ప్యాకెట్లుగా మార్చి యువతే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తుండడం గమనార్హం. ఆ మత్తులో యువత దారితప్పి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ప్రశాంత గోదావరి పల్లెల్లో అలజడి రేగడంతో పాటు చారిత్రక నగరంలో హత్యలు నిత్యకృత్యమవుతున్నాయి. జూలై 28న గణేష్ అనే వ్యక్తిని ముగ్గురు స్నేహితులు రాజమహేంద్రవరం ఇన్నీసుపేట దుక్కలదొడ్డి వద్ద కడతేర్చారు. ఆ ఘటన మరువక ముందే ఈ నెల 5న గోరక్షణపేటకు చెందిన ఆటోడ్రైవర్ బుజ్జిబాబును ఇద్దరు హతమార్చారు. కూటమి ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించామని గొప్పలు చెప్పుకొంటున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడికక్కడే గంజాయి గుప్పుమంటోంది.
తనిఖీల్లో దొరికింది కొంతే..
● తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 120 కిలోల గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని పూణేకు తరలిస్తుండగా, కొవ్వూరు జాతీయ రహదారి సమీపంలో జూలై 4న రాజానగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
● ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీ నుంచి 15.5 కిలోల గంజాయి కొనుగోలు చేసి తెలంగాణలోని కోదాడకు తరలిస్తున్న ఐదుగురు విద్యార్థులను కోరుకొండ పోలీసులు జూన్ 25న అరెస్ట్ చేశారు.
● రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామంలోని జీరో పాయింట్ నుంచి గామన్ బ్రిడ్జి మీదుగా తరలిస్తున్న 193 కిలోల గంజాయిని గత ఏడాది మార్చి 29న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. వాస్తవానికి జిల్లాలోని జాతీయ రహదారి మీదుగా లారీలు, కార్లలో, రైల్వే స్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పోలీసులకు చిక్కకుండా నిత్యం గంజాయి తరలిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
యువతే లక్ష్యంగా విక్రయాలు
రాజమహేంద్రవరంలో నిత్యం ఏదో ఒకచోట అలజడి రేగుతూనే ఉంది. మద్యం, గంజాయి మత్తులో ఆకతాయిలు, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. నగరంలో జూలై నెలలో ఇద్దరు యువకుల నుంచి పోలీసులు కిలో గంజాయి పట్టుకున్నారు. జూన్‌లో ఈస్ట్ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ వద్ద కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా నగరంలో లభించే గంజాయిలో ఒక్క శాతం కూడా కాదు. కొంతమంది స్థానికులు ఏజెన్సీ ప్రాంతానికి బైక్‌లపై వెళ్లి చిన్న సంచుల్లో గంజాయి తీసుకొస్తున్నారు. దానిని రాజమహేంద్రవరం నగరంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు.
● ఇన్నీసుపేట, ఆల్కాట్ గార్డెన్స్, దుక్కలదొడ్డి, ఆదెమ్మదిబ్బ, కోటిలింగాల ఘాట్, క్వారీ సెంటర్, గోరక్షణపేట, అన్నపూర్ణమ్మపేట ప్రాంతాల్లో ఆకతాయిలు, మందుబాబుల అలజడి ఎక్కువగా ఉంది.
● జిల్లాలోని సుమారు వంద ప్రాంతాల్లో గంజాయి జోరుగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పొట్లాలలో కట్టి గంజాయి విక్రయిస్తున్నారు. దీనిని పోలీసులు అరికట్టలేకపోతున్నారు.
● ఇటీవల డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో వంద మందిని పరీక్షించగా... వారిలో 38 మందికి పాజిటివ్ వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 8 మందిని అరెస్ట్ చేశారు.
● కోరుకొండ మండలం కణుపూరు, కాపవరం, గాదరాడ, జంభూపట్నం, గుమ్ములూరు గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. గోకవరం మండలం తిరుమలాయపాలెంలోనూ జోరుగా విక్రయాలు సాగుతున్నాయి.
● తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర పట్టణాలు, పల్లెల్లోనూ గంజాయి విక్రయాలు గుట్టుగా సాగిపోతున్నాయి.
జిల్లాలో పట్టుబడిన గంజాయి ఇలా..
సంవత్సరం కేసులు అరెస్ట్ స్వాధీనం చేసుకున్న గంజాయి
2024 68 250 2,837 కిలోలు
2025 54 197 3,026 కిలోలు
2026 25 86 334 కిలోలు (జూలై వరకు)
పోలీసులకు దొరికేది కొంతే..
తరలిపోతున్నది లెక్కలేనంత
ఒడిశా, ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం మీదుగా ఇతర ప్రాంతాలకు..
పూర్తిగా నిర్మూలించామంటున్న
కూటమి ప్రభుత్వ పెద్దలు
మత్తులో పేట్రేగిపోతున్న
ఆకతాయిలు, రౌడీమూకలు


