రాజానగరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు దీక్షలను విరమించేది లేదని సోమవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ నాన్ టీచింగ్ (ఔట్‌సోర్సింగ్) సిబ్బంది స్పష్టం చేశారు. యూనివర్సిటీ ముఖద్వారం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, రాజమహేంద్రవరం ఆర్డీఓ శివరాముడు, రాజానగరం తహసీల్దార్ దివ్యభారతి, డీఎస్పీ జీవన సోమవారం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. దీక్షలను విరమింపజేసేందుకు వారితో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. ఈ సమయంలో దీక్షాపరులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. 20 ఏళ్ల నుంచి తాము చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తవారిని నియమించే విధంగా టెండర్ నోటీసు జారీ చేయడం బాధాకరమన్నారు. తక్షణమే టెండర్ నోటీసును వెనక్కి తీసుకుని, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈ దీక్షలను విరమించేది లేదన్నారు. చర్చల్లో నాన్ టీచింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై.వీరభద్రచౌదరి, తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారులతో చర్చలు విఫలం


